కొరటాల: సినిమా మాత్రమే కాదండోయ్‌.!

టాలీవుడ్‌ దర్శకుల్లో కొరటాల శివకి ఓ ప్రత్యేకత వుంది. రచయితగా ఎన్నో సినిమాలకు పనిచేసిన కొరటాల, 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కే సినిమాలకు 'క్లాస్‌ టచ్‌' ఇచ్చిన కొరటాల, ఆ సినిమాతో ఓ మంచి మెసేజ్‌ ఇచ్చాడు. కొరటాల దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలోనూ మంచి మెసేజ్‌ కన్పిస్తుంటుంది. 'శ్రీమంతుడు' సినిమా ఆ కోవలోనిదే. 'జనతా గ్యారేజ్‌' సంగతి సరే సరి. 

మెసేజ్‌ ఇద్దామనుకుంటే కమర్షియల్‌ అంశాల జోలికి వెళ్ళకూడదు.. అన్న భావన విన్పించడం సంగతెలా వున్నా, మంచి విషయాన్ని కమర్షియల్‌గా కాస్త జాగ్రత్తగా చెప్పగలిగితే, ఆ కిక్కే వేరప్పా.. అంటాడు కొరటాల శివ. అతనిలో సామాజిక బాధ్యత కన్పిస్తుంటుంది. దటీజ్‌ కొరటాల శివ. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలానికి సంబంధించి పెదవి విప్పేందుకు తెలుగు సినీ ప్రముఖులు తటపటాయిస్తున్నారు. పాలకుల్ని ఈ విషయంలో ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. ఎవరి గోల వారిది. ఈ తరుణంలో, కొరటాల శివ పాలకుల్ని గట్టిగా ప్రశ్నించాడు. 'డ్రగ్స్‌ కేసులో సిట్‌ వేశారు సరే.. అవినీతికి సంబంధించి సిట్‌ వేస్తారా.?' అన్నది ఆ ప్రశ్న. నిజమే కదా.! 

డ్రగ్స్‌ కంటే సమాజానికి అతి పెద్ద మహమ్మారి అవినీతి. ఆ అవినీతి విషయమై పాలకుల్ని కొరటాల ప్రశ్నించిన వైనం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నిజాయితీగా ప్రశ్నించడంలో ఆ కిక్కే వేరప్పా.! దటీజ్‌ కొరటాల శివ. అవును, కొరటాల శివ సినిమా రచయిత, దర్శకుడు మాత్రమే కాదు.. సమాజాన్ని చదివిన, అర్థం చేసుకున్న ఓ మేధావి కూడా.

Show comments