హింసకి పరాకాష్ట.. ఇంకేముంటుంది.?

తెలుగు సినిమాల్లో 'హింస'పై రీసెర్చ్‌ ఓ రేంజ్‌లో జరిగిపోయింది. సినిమా సినిమాకీ హింస పెంచుకుంటూనూ పోతున్నారు. మూతి మీద మీసం రాని హీరోలు కూడా 'ఎ' సర్టిపికెట్‌ సినిమాలు చేసేస్తున్నారు.. 'ఎ' సర్టిఫికెట్‌ చాలావరకు హింస కారణంగానే వస్తుండడం గమనార్హం. ఐదడుగుల హీరో, ఆరున్నర అడుగుల పొడగరి అయిన విలన్‌ని అమాంతం ఎత్తి పడేయడం తెలుగు సినిమాల్లోనే కన్పిస్తుంది. 

ఇక, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సినిమాల్లో 'హింస' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 'రక్తచరిత్ర' ఒక్కటే కాదు, చాలా చాలా సినిమాల్లో హింసని ఓ రేంజ్‌లో ఆయన చూపించేశాడు. 'శివ' సినిమాలో హింస గురించి తెలియనిదెవరికి.? మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తీసినా, ఇంకే సినిమాలు తీసినా.. వర్మ సినిమాల్లో ఖచ్చితంగా హింస వుండి తీరాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే వర్మ, 'హింస'లో పీహెచ్‌డీ చేసేశారనొచ్చు. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, అహింసకి కేరాఫ్‌ అడ్రస్‌ మహాత్మా గాంధీ. అంతటి పవిత్రమైన రోజున, తన హింసాత్మకమైన సినిమా 'వంగవీటి' ట్రైలర్‌ని విడుదల చేస్తున్నాడట వర్మ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. 'హింస' అని వర్మ స్పెషల్‌గా 'కోట్‌' చేస్తోంటే, జనం నవ్వుకోవాల్సి వస్తోంది. రాయలసీమ ఫ్యాక్షనిజంని మించి, బెజవాడ రౌడీ రాజకీయాల్లో హింస వుంటుందా.? అనడక్కండి, వర్మ ఏదైనా ఎలాగైనా చూపించగలడు. 

సినిమాలో హింస వుంటే ఫర్లేదు, ఆ సినిమాల కారణంగా బెజవాడలో మళ్ళీ ఒకప్పటి హింసాత్మక ఘటనలు రిపీట్‌ అవకుండా వుంటే చాలు. కానీ, దానికి గ్యారంటీ లేదు.!

Show comments