తాప్సీ.. వన్‌ అండ్‌ ఓన్లీ.!

ఓ సబ్‌మెరైన్‌లో 75 శాతం సినిమా షూటింగ్‌.. ఆ ఘనత తనకు మాత్రమే దక్కిందని చెబుతోంది అందాల భామ తాప్సీ. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోందట. సినిమా పూర్తయ్యిందనీ, విడుదలకు సిద్ధమవుతోందనీ అంటోన్న తాప్సీ, ఇప్పటివరకూ ఏ సినిమా విషయంలోనూ ఇంత ఎక్సయిట్‌మెంట్‌కి గురి కాలేదనీ, 'ఘాజీ' విడుదల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాననీ చెప్పుకొచ్చింది. 

ఘాజీ అనేది ఓ సబ్‌మెరైన్‌. పూర్తి పేరు పిఎన్‌ఎస్‌ ఘాజీ. పాకిస్తాన్‌కి చెందిన సబ్‌మెరైన్‌ ఇది. ఇండియా - పాకిస్తాన్‌ల మధ్య జరిగిన 1971 నాటి యుద్ధంలో భారత సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుట్‌, పిఎన్‌ఎస్‌ ఘాజీని పేల్చేసింది. ఆనాటి ఆ సంఘటనల్ని కళ్ళకు కట్టినట్లు 'ఘాజి'లో చూపించబోతున్నారట. 

ఇక, 'ఘాజీ' సినిమాలో తాప్సీ, బంగ్లాదేశీ రెఫ్యుజీగా కనిపించబోతోంది. మరోపక్క బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి 'పింక్‌' సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్‌లోనే ప్రకాష్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'తడ్కా' సినిమాలోనూ నటించనుంది తాప్సీ. మొత్తమ్మీద సౌత్‌లో తాప్సీ అడ్రస్‌ లేకపోయినా, బాలీవుడ్‌లో మాత్రం అవకాశాలు బాగానే దక్కించుకుంటోందన్నమాట. 

అంతా బాగానే వుందిగానీ, సబ్‌మెరైన్‌లో సినిమా షూటింగ్‌ అంత ఆషామాషీ వ్యవహారం కాదు. తాప్సీ చెబుతున్న ఎక్సయిట్‌మెంట్‌ సినిమాలో వుంటుందా.? బంగ్లాదేశీ రెఫ్యుజీ (శరణార్ధి)కీ సబ్‌మెరైన్‌కీ లింకేంటి.? ఏమో, వేచి చూడాల్సిందే.

Show comments