బాబు పై మళ్లీ కోర్టుకు.. గెలుద్దామనే..?

అవును.. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని కేల్కర్ కమిటీ తప్పు పట్టింది, ఆ విధానాన్ని ప్రోత్సహించరాదని ఆ కమిటీ తేల్చింది. అయితే ఏంటి? 

ఆ కమిటీ ఏమీ అల్లా టప్పా కాదు.. ఆ విధానంపై అధ్యయనం చేయించడానికి భారత ప్రభుత్వం చే నియమితమైన కమిటీ అది అంటారా! అయితే ఏంటి?

సుప్రీం కోర్టు పాత అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చూసినా.. టెండర్ నోటిఫికేషన్లను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జారీ చేయడం సమర్థనీయం కాదు. కోర్టు కూడా ఈ విధానం విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టింది ఇది వరకూ అంటారా..! అయితే ఏంటి?

రాజధాని అభివృద్ధికి సంబంధించిన ఈ టెండర్ నోటిఫికేషన్ విషయంలో పారదర్శకత లేదు.. అంటారా! సో వాట్?

సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి పది నెలల సమయం తీసుకుంది.. అందుకు పోటీగా ఆహ్వానిస్తున్న ప్రతిపాదనలకు మాత్రం 45 రోజులే సమయం ఇచ్చారు. అయితే ఏంటి?

ప్రతిపాదనలు ఇవ్వదలుచుకున్న కంపెనీ ఇండియాలో సంపాదించిన అనుభవాన్ని అస్సలు పరిగణనలోకి తీసుకోమని.. విదేశాల్లో ఏవైనా నిర్మాణాలు చేపట్టిన అనుభవాన్ని మాత్రమే లెక్కేస్తామని సీఆర్ డీఏ చెబుతోంది. ఇది అన్యాయం. అయితే ఏంటి?

ఇదంత ఒక పెద్ద స్కామ్.. సింగపూర్ కన్సార్టియంకు పనులు అప్పగించడానికి అనుగుణంగా ప్రభుత్వం షరతులు పెట్టింది. ఏదో నామమాత్రంగా నోటీఫికేషన్ ఇచ్చి.. ఎవరికీ అర్హతలు లేవు, సింగపూర్ కన్సార్టియంకు మాత్రమే ఉంది.. అని తేల్చేయడానికే ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉంది కానీ.. మరోటి కాదు. అయితే ఏంటి?

స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై ఇది వరకూ అనేక విమర్శలు వచ్చాయి. ఏపీ నూతన రాజధాని అభివృద్ధిలో పనులను ఈ పద్ధతిలో కేటాయిస్తున్న తీరును చూసి.. చాలా మంది నోరెళ్ల బెట్టారు. ఇది భారతదేశానికి ఏ మాత్రం అనుకూలమైన వ్యవహారం కాదని.. ఇది వరకూ కోర్టులు కూడా ఈ పద్ధతిని తప్పు పట్టాయి. ఈ నేపథ్యంలో బాబు ప్రభుత్వ విధానంలో ఏ మాత్రం పారదర్శకత లేదని.. కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఈ టెండర్ నోటిఫికేషన్ విషయంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపి వేయాలని.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు.

ఇలా కోర్టుకు వెళ్లిన వారికి ఎంత దురాశ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క సారి చరిత్రను చూసుకుని కోర్టుకు వెళ్లాల్సింది. ఇంతరకూ సీఎంగా బాబు ఉన్నప్పుడు ఆయన విధానాల మీద కోర్టుకు వెళ్లి కానీ, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఆస్తుల విషయంలో కోర్టుకు ఎక్కి కానీ, ఆయన హయాంలో వార్తల్లోకి వచ్చిన స్కాముల విషంయలో కానీ.. కోర్టులకు ఎక్కి గెలిచి నిలిచిన మగాడు ఎవరైనా ఉన్నారా?

ఒకటి.. బాబు విధానాలమీద, ఆయన వ్యక్తిగతంగా పొందిన ప్రయోజనాల మీద ఎవరైనా కోర్టుకు వెళితే అవి విచారణ అర్హం కాకుండా అయినా పోతాయి, లేదా.. ఆ విషయంలో అప్పటికే మొదలైన విచారణలపై స్టే వస్తుంది.. అదీ కాకపోతే.. సదరు పిటిషనర్ కోర్టు చేతిలో చీవాట్లు తింటాడు!

మరి స్విస్ ఛాలెంజ్ విధానంలోని లోటు పాట్లను ఇక్కడ జరగుతున్న మోసాన్ని ప్రస్తావిస్తూ.. కొంతమంది కోర్టుకు ఎక్కారు. మరి వీళ్లు ఎన్ని లొసుగులను చూపినా.. ఈ విషయంలో బాబు ప్రభుత్వ విధానానికి చుక్కెదురవుతుందనేది కేవలం భ్రమ. ఇది నిస్సందేహం. 

ఇలాంటి పరిస్థితుల మధ్య కోర్టుకు ఎక్కిన వారిని చూస్తుంటే.. వీరి వాదనకు విలువ దక్కకపోవడంతో బయటకు వస్తారా? లేక కోర్టు చేత అక్షింతలు వేయించుకుని మరీ వస్తారా? వెయిట్ అండ్ సీ! ఎదురుదెబ్బతో వీరు వెనక్కు మాత్రం రావడం పక్కా! ఎలా వస్తారో చూడాలంతే. 

Show comments