గంధర్వలోకానికేగిన బాలమురళీ గాత్రం.!

ఓ సందర్భంలో 'త్యాగరాజుకన్నా గొప్పగా మీ గాత్రం వుంటుంది కదా..' అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, 'నాకు లభించిన ప్రచారం త్యాగరాజు కాలంలో లభించలేదు.. ఆయన పేరు చెప్పుకుని మేం బతికేస్తున్నాం..' అని నిర్మొహమాటంగా చెప్పారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. 'సంగీతం అంటే సముద్రం.. అందులో ఈదుతున్నాను నేను, ఇంకా ఈదాల్సింది చాలా వుంది' అంటూ ఎప్పుడూ చెబుతుండేవారాయన. 'మీ అంత గొప్పగా ఎవరూ పాడలేరు కదా..' అనడిగితే, అందరూ అంటారేమో, నేనలా అనుకోలేనెప్పుడూ అని చెబుతారు బాలమురళీకృష్ణ. అది ఆయన గొప్పతనం. 

సంగీత శిఖరంగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరు ఆయన తర్వాత కూడా మార్మోగిపోతూనే వుంటుంది. ఎందుకంటే, ఆయన పుడుతూనే సంగీత సాధన మొదలుపెట్టారు. కడదాకా సంగీత సాగరాన్ని ఈదుతూనే వున్నారు. 'ఎందరో మహానుభావులు..' అంటూ సాగే ఆయన గాత్రం, భూమ్మీద మనిషన్నవాడు బతికున్నదాకా విన్పిస్తూనే వుంటుంది. ఆ గాత్రంలోని మాధుర్యం అలాంటిది. ఒకటా.? రెండా.? ఆయన సంగీత సామ్రాజ్యంలో చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఇకపై అలాంటి ప్రయోగాలకు ఆస్కారం లేదు. ఎందుకంటే, సినీ సంగీత శాస్త్రవేత్త మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇక లేరు. 

చెన్నయ్‌లోని తన స్వగృహంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ తుదిశ్వాస విడిచారన్న వార్త, సంగీత ప్రపంచం మూగబోయేలా చేసింది. కర్నాటక సంగీతంలో ఆరితేరిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ, చాలా తెలుగు సినిమాల్లోనూ పాటలు పాడారు. పాటలు పాడటం కాదు, ఏ పాట పాడినా ఆ పాటకు గౌరవం తీసుకొచ్చేవారు. 'భక్తప్రహ్లాద' సినిమాలో నారదుడిగానూ కన్పించారు. టీటీడీ ఆస్తాన విధ్వాంసుడిగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన బాలమురళీకృష్ణ తొమ్మిదవ యేటనే తొలి కచేరీ నిర్వహించారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సందర్భంగా ఇటీవల ఇచ్చిన కచేరీనే ఆయనకు చివరి కచేరీ. ఒకటా.? రెండా.? ఏకంగా 25 వేలకు పైగా కచేరీలు చేసిన ఘనుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. 

ఫిలింఫేర్‌ అవార్డులు, జాతీయ అవార్డులు.. ఇలా ఒకటేమిటి.? లెక్కలేనన్ని బిరుదులు ఆయన సొంతం. అంతేనా, భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలు పద్మశ్రీ, పద్మవిభూషన్‌ ఆయన్ను వరించాయి. విదేశాల నుంచీ ఆయన పలు పురస్కారాల్ని అందుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం. 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సినీ ప్రముఖులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

Show comments