ఔను.. ఆయన మారిన మనిషి.!

'నా ఉద్దేశ్యం సైన్యాన్ని కించపర్చడం ఏమాత్రం కాదు. దేశం భద్రత విషయంలో, దేశభక్తి విషయంలో రాజకీయాలు చెయ్యదలచుకోవడంలేదు. నా పొరపాటుని సరిదిద్దుకుంటున్నాను. నా వ్యాఖ్యలు సైన్యం మనోభావాలు దెబ్బతీసినట్లు వుంటే, క్షమించమని కోరుతున్నాను. నా ఉద్దేశ్యం, సర్జికల్‌ స్ట్రైక్స్‌పై పాక్‌ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానంగా ఆ స్ట్రైక్స్‌కి సంబంధించిన వీడియోలు వెలుగులోకి తీసుకురావాలని మాత్రమే.. పాకిస్తాన్‌ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ వెనుక దేశమంతా వుంది. నేను కూడా ఈ విషయంలో ఆయనకు మద్దతుగా ఉంటాను..' 

- ఇదీ మారిన మనిషి, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజా వ్యాఖ్యల సారాంశం. 

మార్పు మంచిదే. తప్పు చేయడం సంగతెలా వున్నా, ఆ తప్పుని సరిద్దుకోవాలనుకోవడంలోనే హుందాతనం కనిపిస్తుంది. ఈ విషయంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ని అభినందించి తీరాల్సిందే. భారత సైన్యం, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో నరేంద్రమోడీకి సెల్యూట్‌ చేస్తూనే, ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేసి కేజ్రీవాల్‌ వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆయన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ మీడియా నానా హంగామా చేసింది. కేజ్రీవాల్‌ని రియల్‌ హీరో అని పొగిడేసింది. దాంతో కేజ్రీవాల్‌ గొంతులో పచ్చి వెలక్కాయపడింది. ఎలాగైతేనేం, కేజ్రీవాల్‌ ఇప్పుడు తప్పు తెలుసుకున్నారు. అభినందనీయమే. 

కేజ్రీవాల్‌ అక్కడితో ఆగలేదు, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీరుని ఎండగట్టేశారు. 'సైన్యం రక్తం వెనుక నరేంద్రమోడీ రాజకీయాలు చేస్తున్నారు..' అంటూ రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లో చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు అరవింద్‌ కేజ్రీవాల్‌. రాజకీయాలకతీతంగా ఇప్పుడు, భారతదేశంలో ప్రతి ఒక్కరూ భారత ప్రభుత్వానికి అండగా వుండాలని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌కి గుణపాఠం చెప్పాల్సిందేనని కేజ్రీవాల్‌ పునరుద్ఘాటించారు. 

మొత్తమ్మీద, కేజ్రీవాల్‌ మారారు.. హుందాతనం చాటుకున్నారు. మరి, రాహుల్‌గాంధీ కూడా తన హుందాతనాన్ని చాటుకుంటారా.? శవ రాజకీయాలు చేస్తూనే వుంటారా.? వేచి చూడాల్సిందే.

Show comments