మొత్తానికి తెలుగుదేశం యువనేత లోకేష్ బాబు మంత్రి పదవి వ్యవహారం ఓ కొలిక్కి వస్తోంది. ఇంతవరకు ఫీలర్లకే పరిమితమైన ఈ వ్యవహారంపై తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పెదవి విప్పారట. వెలగపూడి సచివాలయంలో ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ లోకేష్ ను త్వరలో మంత్రి పదవి లోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారట. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చాన్నాళ్లుగా లోకేష్ కు మంత్రి పదవి అన్నది దోబూచులాడుతోంది.
కానీ ఇటీవల ముఖ్యమంత్రి పై ఈ విషయమై ప్రెజర్ పెరిగింది. చోటా మోటా నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు చాలా మంది పలు పనులను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి, వాటిని జరిపించుకోలేకపోతున్నారు. మరీ లోకేష్ ఎక్కువగా జోక్యం చేసుకుంటే సమస్యలు, విమర్శలు వచ్చే ప్రమాదం వుంది. అందుకే ఇక తెగించి, మంత్రి పదవి ఇవ్వక తప్పదని ముఖ్యమంత్రి పై పార్టీ వర్గాల నుంచి వత్తిడి వస్తోంది.
ఇదిలా వుంటే లోకేష్ కు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇస్తారని తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తోంది. హోం, ఆర్థిక, వైద్య, నీటిపారుదల వంటి కీలక మంత్రి పదవులు అన్నీ ఇప్పట్లో మార్చే అవకాశం లేదు. పైగా అర్బన్ ఓటర్లు, యువతకు లోకేష్ చేరువ కావాలన్నది బాబుగారి ఆలోచనగా తెలుస్తోంది. అదీ కాక పట్టణాల విషయంలో కేంద్రం నిధులు బాగానే వస్తున్నాయి. అందువల్ల అభివృద్ధి పనులు చేపట్టడం కాస్త సులువు అవుతుంది. ప్రస్తుతం ఆ మంత్రిత్వ శాఖ నారాయణ దగ్గర వుంది. ఆయన నుంచి ఆ పదవి తప్పిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం వుంది.
అయితే పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ లోకేష్ కు ఇవ్వడం అంటే, పెండింగ్ లో వున్న మున్సిపల్ ఎన్నికల భారం కూడా ఆయన మీద పెట్టడమే అవుతుంది. మరి ఆ విధంగా ధైర్యం చేస్తారో? వేరే శాఖకు మంత్రిని చేస్తారో? ఐటి శాఖ అయితే లోకే్ష్ కు అంత ఉపయోగకరంగా వుండదని తెలుగుదేశం వర్గాల బోగట్టా. ఎందకుంటే ఇప్పుడు ఆ పదవి ఇచ్చినా కనిపించే అభివృధ్ది వుండదు. తెలుగదేశం జనాలకు అంత ఉపయోగమూ వుండదు. ఇదే పట్టణాభివృధ్ది శాఖ అయితే ఏ అధికారితో అయినా మాట్లాడ వచ్చు, కాంట్రాక్టులు, నామినేషన్ లు, పనులు ఇలా వ్యవహారాలు చాలా వుంటాయి. మరి బాబుగారు కొడుకు కు ఏ పదవి ఇస్తారో చూడాలి.