మిస్టర్‌ నీరో.. ఈ ప్రశ్నకు బదులేది.?

రోమ్‌ తగలబడిపోతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడో లేదోగానీ.. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోరు బాట పడితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం తిరుపతిలో వెంకన్న సేవలో మునిగి తేలడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్‌ని, రాజకీయంగా దెబ్బకొట్టేందుకు తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ ప్రయత్నిస్తున్నారా.? ఈ క్రమంలోనే సరిగ్గా టైమ్‌ చూసి, నిరుద్యోగ ర్యాలీ పేరుతో హంగామా సృష్టించారా.? అన్న విషయాల్ని పక్కన పెడితే.. నిరుద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకీ, వాస్తవాలకీ అసలు పొంతనే లేకపోవడం నేషనల్‌ మీడియా దృష్టినీ ఆకర్షించింది. 

తెలుగు మీడియా, కేసీఆర్‌ విషయంలో ప్రజల తరఫున ప్రశ్నించడానికి భయపడ్తున్న మాట వాస్తవం. గతంలో ఓ పత్రికపైనా, రెండు ఛానల్స్‌పైనా కేసీఆర్‌ కన్నెర్రజేయడంతో ఆ తర్వాతి నుంచీ ఆయనకు వ్యతిరేకంగా కథనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాయి మీడియా సంస్థలు. తెలుగు మీడియా భయపడినట్లు నేషనల్‌ మీడియా భయపడదు కదా.? నేషనల్‌ మీడియా లెక్కలు వేరు.! 

నేషనల్‌ మీడియాలో ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని 'నీరో'తో పోల్చుతూ కథనాలు కడిగి పారేశాయి. క్యాంప్‌ ఆఫీస్‌ కోసం చేసిన ఖర్చు, ఆ మధ్య ఆయుత చండీ యాగం కోసం చేసిన ఖర్చు, ప్రత్యేకంగా తన కోసం తయారుచేయించుకున్న వాహనం (బస్సు) కోసం చేసిన ఖర్చు, బోనాలకి వెచ్చించిన మొత్తం.. వీటన్నిటినీ లెక్క తేల్చింది నేషనల్‌ మీడియా. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ ముందున్న దరిమిలా, ఈ వృధా ఖర్చు అవసరమా.? అన్నది నేషనల్‌ మీడియా ప్రశ్న. ఈ ప్రశ్నకి తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కేశవరావు సమాధానం చెప్పలేక సైలెంటయిపోయారు. 

వృధా ఖర్చు సంగతి పక్కన పెట్టి, నిరుద్యోగుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, కోదండరామ్‌ని తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో అరెస్ట్‌ చేయడం వంటి అంశాలపై ఇంకా గట్టిగా కడిగేసింది నేషనల్‌ మీడియా. వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో లేకపోతే, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ సాధించగలిగేవారా.? అన్నది అట్నుంచి వచ్చిన ప్రశ్న. ఇక్కడా కేశవరావు నోట సమాధానం రాలేదు. 'తెలంగాణ విషయాల్లో మీ జోక్యం అనవసరం..' అంటూ నేషనల్‌ మీడియాపై గుస్సా అయ్యారాయన.  Readmore!

'తెలంగాణ ఎక్కడో లేదు.. ఇండియాలోనే వుంది.. నేను ఇండియన్‌ని.. ప్రజల తరఫున ప్రశ్నించడం నా బాధ్యత..' అంటూ అట్నుంచి జర్నలిస్టు ప్రశ్నిస్తోంటే, కేశవరావు అసహనంతో దుకాణం కట్టేయాల్సి వచ్చింది. కేశవరావు సంగతెలా వున్నా, లక్ష ఉద్యోగాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. 

చివరగా: కేసీఆర్ మాత్రమే కాదు.. దండగ ఖర్చు విషయంలో ఆయనతో పోటీ పడ్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఆయనా, ఈ జల్సాలపైనా, ఉద్యోగాలపైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సి వుంటుంది.. చెప్తారా మరి.?

Show comments

Related Stories :