రజనీ 'కబాలి' కొత్త స్టంట్‌.!

ఇండియా మొత్తమ్మీద, 2016లో ఆ సినిమాకి క్రియేట్‌ అయిన హైప్‌ ఇంకే ఇతర సినిమా మీదా క్రియేట్‌ అవలేదనడం అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో 'కబాలి' సినిమాకి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. తమిళ సూపర్‌ స్టార్‌ అయిన రజనీకాంత్‌కి టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా చాలా సినీ పరిశ్రమలో విపరీతమైన క్రేజ్‌ వుండడమే అందుకు కారణం. 

'భాషా' స్థాయి సినిమా అనీ, ఇంకోటనీ.. రజనీకాంత్‌ ఫొటో పెట్టి విచ్చలవిడిగా పబ్లిసిటీ దంచేశారు. ఓ విమానాన్ని 'కబాలి' పోస్టర్‌తో డిజైన్‌ చేయడం, 'కబాలి' సినిమా కోసం చెన్నయ్‌లోని పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రత్యేక సెలవు దినాన్ని మంజూరు చేయడం.. అబ్బో, పెద్ద కథే నడిచింది. 'కబాలి' సినిమా బ్లాక్‌ టిక్కెట్‌ తమిళనాడులో సరికొత్త రికార్డులు సృష్టించింది. అభిమానులు కొందరు అత్యుత్సాహంతో వేలు కాదు, లక్షలు పోసి 'కబాలి' టిక్కెట్లు కొన్నారు. 

ఇంత చేసినా, 'కబాలి' సినిమాలో మేటర్‌ లేకపోతే ఏమవుతుంది.? అదే జరిగింది. సినిమా తుస్సుమంది. 'కొచాడియాన్‌', 'లింగ' తదితర సినిమాల బాటలోనే 'కబాలి' ఢామ్మంది. అయితే, కాస్త బెటర్‌ అంతే. చిత్రంగా ఈసారి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ఆందోళన తక్కువ రోజుల్లోనే సద్దుమణిగింది. 

ఇప్పుడీ సినిమాకి కొత్త సోకులు అద్దుతున్నారు. సినిమా నుంచి 'కట్‌' చేసిన సీన్స్‌ (నిడివి పెరుగుతుందనే కారణంగా) అభిమానుల కోసం రాబోతున్నాయి. అదీ యూ ట్యూబ్‌ ద్వారా. అవేంటి.? అన్న ఉత్కంఠ ఆల్రెడీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానుల్లో షురూ అయ్యింది. రేపు ఈ సీన్స్‌ యూ ట్యూబ్‌లో ప్రత్యక్షమవుతాయి. కబాలి డిలీటెడ్‌ సీన్స్‌ అనే హాష్‌టాగ్‌తో ఈ సీన్స్‌ రేపట్నుంచి యూ ట్యూబ్‌లో అందుబాటులో వుంటాయని చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌ థాను ప్రకటించారు. 

సాధారణంగా కొన్ని సినిమాల విషయంలో కత్తిరించిన సన్నివేశాల్ని, సినిమా విడుదలైన నాలుగైదు రోజులకి విడుదల చేయడం జరుగుతుంటుంది. ఇంకొన్ని సినిమాల విషయంలో, ట్రిమ్మింగ్‌ కూడా మామూలే. కానీ, జనం మర్చిపోయిన సినిమాని మళ్ళీ లైమ్‌లైట్‌లోకి తీసుకురావడానికి 'డిలీటెడ్‌ సీన్స్‌'ని విడుదల చేయడం కాస్త కొత్త విషయమే. ఇంతకీ, ఈ పబ్లిసిటీ స్టంట్‌ వెనుక ఉద్దేశ్యం ఏమై వుంటుందబ్బా.!

Show comments