పిక్‌ టాక్‌: మెగా 'ఫ్యాన్‌' మూమెంట్‌.!

చాలా చాలా చాలా రేర్‌ మూమెంట్‌ ఇది. నిజంగానే ఇది మెగా మూమెంట్‌ ఇది. అవును, ఇది 'మెగా ఫ్యాన్‌' మూమెంట్‌. ఫొటోలో ఉన్న వ్యక్తుల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు కదా.! మెగాస్టార్‌ చిరంజీవి పక్కన వున్నదెవరో కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ కుమార్తె కవిత. చిరంజీవి, రాజ్యసభకు కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు కల్వకుంట్ల కవిత. 

ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా చిరంజీవిని కలిసిన కవిత, చిరంజీవితో దిగిన ఫొటోని సోషల్‌ మీడియాలో 'ఫ్యాన్‌ మూమెంట్‌' అంటూ పోస్ట్‌ చేయడం గమనార్హం. రాజకీయం రాజకీయమే, అభిమానం అభిమానమే. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ నటించిన 'ధృవ' సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో కవిత సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సందడి చేసిన విషయం విదితమే. ఆ మాటకొస్తే చరణ్‌, కేటీఆర్‌ మంచి స్నేహితులు కూడానట. 

తన స్నేహితుడు దర్శకుడిగా మారి ఆ మధ్య ఓ సినిమా తెరకెక్కిస్తే, ఆ సినిమా ఫంక్షన్‌కి చరణ్‌ని స్వయంగా కేటీఆర్‌ ఆహ్వానించడం, ఆ ఫంక్షన్‌లో ఇద్దరూ 'స్నేహపూర్వకంగా' మెలగడం తెల్సిన విషయమే. ఇప్పుడిలా చిరంజీవితో, కవిత.. అదీ 'ఫ్యాన్‌ మూమెంట్‌'. అన్నట్టు, టీఆర్‌ఎస్‌ తరఫున కవిత - మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తోంటే, చిరంజీవి కాంగ్రెస్‌ తరఫున గోపాలకృష్ణ గాంధీకి మద్దతిస్తున్నారు.

Show comments