టీడీపీ ఎమ్మెల్యేపై ఐటీ దాడులు.. ఏంటీ వైపరీత్యం.!

అధికార పార్టీకి చెందిన నేతలపైనా, వారి బంధువులపైనా ఐటీ దాడులు జరగడం చాలా చాలా అరుదు. టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై ఐటీ దాడులు జరగడంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. దాడుల్లో ఏం తేలింది.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. మోదుగుల, ముఖ్యమంత్రి చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. గతంలో ఎంపీగా పనిచేశారాయన. ఏకకాలంలో గుంటూరు, హైద్రాబాద్‌, బెంగళూరుల్లో మోదుగుల నివాసం, కార్యాలయాలపై దాడులు జరిగాయి. 

మామూలుగా అయితే, అధికార పార్టీ ఇలాంటి విషయాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చూస్తుంటాం. అందుకే, చాలా అరుదుగా మాత్రమే అధికార పార్టీపై ఐటీ దాడులు జరుగుతుంటాయి. రాజకీయాల్లో పెద్దగా మోదుగులపై అవినీతి ఆరోపణలు, అక్రమార్జన వంటి ఆరోపణలు లేవనే చెప్పాలి. ఏమో, తెరవెనుక బాగోతం ఎవరికి ఎరుక.? అయితే, అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులపైన అవినీతి ఆరోపణలు వస్తున్నా ఇంతవరకు ఐటీ శాఖ స్పందించకపోవడం గమనార్హం. ఓటుకు నోటు కేసులో, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పలువురు నేతలపైనా ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా ఐటీ శాఖ సైలెంట్‌గానే వుంది. అమరావతి భూ కుంభకోణం విషయమై వెల్లువెత్తిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అయినా, అధికార పార్టీ నేతలపై ఐటీ దాడులు జరిగిన దాఖలాల్లేవు. 

ఇక, మోదుగుల ఇంటిపై ఐటీ దాడుల విషయమై అధికార పార్టీ అప్రమత్తమయ్యింది. ఆ పార్టీకి చెందిన నేతలెవరూ ఈ విషయంపై కనీసం 'కామెంట్‌' చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతానికి మోదుగుల కూడా అందుబాటులో లేరు. ఐటీ శాఖ మోదుగులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ నోటీసులకు సమాధానం చెప్పాకే మోదుగుల మీడియా ముందుకు వచ్చే అవకాశముందట. మరోపక్క, ఈ వ్యవహారంపై మోదుగుల, చంద్రబాబుకి ఇప్పటికే వివరణ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. 

చూస్తోంటే, ఇది చంద్రబాబు 'మాయ'గానీ కాదు కదా.? అన్న అనుమానాలైతే తెరపైకి వస్తున్నాయి. 'నేను నిప్పు..' అన్పించుకోవడానికి చంద్రబాబు, మోదుగులను బలిపశువుని చేస్తున్నారా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే మరి.

Show comments