సెట్ అయిందా..? అది కూడా మాయేనా?

గరగపర్రులో దళితులకు , ఇతర కులాలకు మధ్య ఒక వివాదం ఏర్పడింది. అంబేద్కర్ వివాహం ఏర్పాటుకు సంబంధించిన వివాదం అది. కొన్నాళ్లుగా ఇది ఒక సంక్షోభం స్థాయికి చేరిపోయింది. దళితులకు ఇచ్చిన కౌలుభూములను రద్దు చేసుకోవడం, వారిని పనుల్లోకి పిలవకుండా ఒక రకంగా సంఘ బహిష్కారం విధించడం జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం అట్టుడికిపోయింది. అయితే... తాజాగా ఇరువర్గాలు చేతులు షేక్ హ్యాండ్ లు ఇచ్చుకునేలా రాజీ కుదిర్చి, షేకింగ్ హ్యాండ్స్ ఫోటోలు తీయించి.. అక్కడితో గరగపర్రు వివాదం సమసిపోయిందని ప్రభుత్వం ప్రకటించేసింది. ముగ్గురు మంత్రులు నక్కా ఆనంద్ బాబు, జవహర్, పితాని సత్యనారాయణ, ఎష్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ అంతా కలిసి రెండు రోజుల పాటూ ఇరువర్గాలతో సుదీర్ఘ చర్చలు జరిపి దీన్ని ఒక కొలిక్కి తెచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయితే లోతుగా పరిశీలిస్తే.. గరగపర్రు వివాదం నిజంగానే ఒక కొలక్కి వచ్చిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేవలం షేకింగ్ హ్యాండ్స్ తప్ప.. అసలు వివాదానికి మూలమైన అంశాలేమీ పరిష్కారానికి నోచుకోలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా ముగించేశాం అన్నట్లుగా మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నది. 

తరచిచూస్తే..

ఈ వివాదంలో ప్రధానంగా నాలుగు అంశాలు ఉన్నాయి.
1) అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు
2) దళితులను కూలి పనులకు పిలవడం
3) దుస్తుల ఉతికే రేవు వివాదం
4) ఇతర కులాల వారు తమ భూములను దళితులకు కౌలుకివ్వడం.

1) అంబేద్కర్ విగ్రహం సంగతి తేలనే లేదు. దాన్ని ఇప్పుడున్న చోటనే ఏర్పాటు చేయానికి స్వయంగా ఎమ్మెల్యేనే అడ్డం పడ్డారు. అక్కడ పంచాయతీ ఆఫీసు నిర్మించాల్సి ఉంది కాబట్టి కుదరదని చెప్పారు. చెరువు కట్ట మీద పెట్టడానికి , వ్యవహారం కోర్టులో ఉన్నందున కుదరదని అన్నారు. కాకపోతే.. ప్రభుత్వం నుంచి దీనికి విడిగా అనుమతి తెస్తాం అంటూ మంత్రులు ప్రస్తుతానికి ఓ మాట చెప్పి ఒప్పించారు. అంతే తప్ప.. విగ్రహం సంగతి వాస్తవంగా తేలనేలేదు.

2) దళితులను కూలి పనులకు పిలవడానికి ఇతర కులాల వారు ఒప్పుకున్నారు. ఆచరణలో ఇదెలా ఉంటుందో మరో పదిరోజులు గడిస్తే గానీ తెలియదు.

3) దుస్తులు ఉతికే రేవు వివాదాన్ని తాను చూస్తానంటూ ఎమ్మెల్యే దాటవేశారు. అది తేలలేదు.

4) భూముల్ని ఇప్పటికే ఇతరులకు కౌలుకు ఇచ్చేశాం అని.. మళ్లీ దళితులకు ఇవ్వడం కుదరదని ఇతర కులాల వారు చెప్పారు. ఏమైనా కుదిరితే కొన్ని భూములు ఇవ్వగలం అన్నారు. దళితులు అంతో ఇంతో సేద్యం చేసుకోడానికి ఉన్న ఆధరవు కౌలుభూముల విషయంలో రాజీ చర్చలు ఒక రకంగా బెడిసికొట్టినట్టే. 
ఈ రకంగా వివాదానికి మూలమైన ఏ అంశమూ పరిష్కారం కాకపోయినా.. అంతా అయిపోయింది.. గరగపర్రులో శాంతి నెలకొల్పేశాం. సాధించేశాం.. అంటూ మంత్రులు టముకు వేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వివాదం నివురుగప్పిన నిప్పులాగే ఉన్నదని, మళ్లీ ఏదో ఒకనాడు జ్వాలలు రేగక తప్పదని పలువురు అనుమానిస్తున్నారు. 

Show comments