వాడుకున్నారు.. వదిలేశారు.. అంతేనా.?

2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ 'ఎన్నికల ప్రచారం' నిర్వహించిన విషయం విదితమే. వ్యక్తిగా, ఆ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ ప్రచారం చేసి వుంటే, ఆయన జస్ట్‌ ప్రచారకర్త మాత్రమే అయి వుండేవారు. కానీ, కాస్త కొత్తగా ఆలోచించి, జనసేన పార్టీని పెట్టి.. 'ఎన్డీయే కూటమి'లో భాగమయ్యాడాయన. ప్చ్‌, ఏం లాభం.? ఏం చేసినాసరే, 'ప్యాకేజీ పవన్‌కళ్యాణ్‌' అనే విమర్శల్ని ఆయన తప్పించుకోలేకపోయారు. 

ఇప్పుడు, పవన్‌కళ్యాణ్‌ని ప్యాకేజీ కళ్యాణ్‌గా బీజేపీనే తేల్చేస్తోంది. ప్యాకేజీ డీల్ మధ్యలోనే ముగిసిన వైనంబీజేపీ నేతల మాటల్ని బట్టి అర్థమవుతోంది. తాజాగా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, 'ఎన్నికల్లో మాకు ప్రచారం చేసిపెట్టాడంతే.. ప్రచారం చేయడానికి రాజకీయ అనుభవం ఎందుకు..' అంటూ ప్రశ్నించారు. ఈ మాటల ఉద్దేశ్యమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవసరం తీరాక, అల్లుడు డాష్ డాష్ అయ్యాడని తెలుగులో ఓ ముతక ’వాడుక‘ వుందండోయ్. 'ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు నా అనుభవం ఎవరికీ అవసరంలేదు.. ఇప్పుడు అనుభవం గురించి మాట్లాడుతున్నారు..' అంటూ పవన్‌ ఈ మధ్యనే అసహనం వ్యక్తం చేసిన దరిమిలా, దానికి వెంకయ్య, పై విధంగా కౌంటర్‌ ఇచ్చారు. 

నిజమే మరి, ఓ సినీ ప్రముఖుడ్ని ప్రచారానికి తీసుకురావడమంటే, దానికోసం 'రెమ్యునరేషన్‌' ఇవ్వడం, లేదంటే బహుమతి కింద ఏ పదవో ఇవ్వడం రాజకీయ పార్టీలకు అలవాటే. పవన్‌ విషయంలో కూడా బహుశా బీజేపీ అలాగే అనుకుని వుంటుంది. ఇంతకీ, పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్యాకేజీనీ బీజేపీ నుంచి అందుకున్నారో కూడా, ఆ పార్టీ నేతలు చెబితే, ఇంకొంచెం ఎఫెక్టివ్ అనేలా వుండేదేమో. పవన్‌కళ్యాణే, తనను తాను ఎక్కువ ఊహించుకుని, ఇదిగో ఇప్పుడిలా బోల్తా కొట్టేశారు. 

ఉత్తరాది - దక్షిణాది.. అంటూ పవన్‌ చేస్తున్న వ్యాఖ్యలమీదా వెంకయ్య ఘాటుగా స్పందించారు. 'ఎన్నికల్లో మాకు మద్దతిచ్చినప్పుడు ఆయనకి తెలియదా.? ఇప్పుడేనా మాది, ఉత్తరాది పార్టీ అయిపోయింది.? బీజేపీ ఉత్తరాది పార్టీ కాదు, దక్షిణాదిలోనూ సత్తా చాటుతోంది..' వెంకయ్య, సున్నితంగానే ఝలక్‌ ఇచ్చారు పవన్‌కళ్యాణ్‌కి. 

ఇదిలా వుంటే, ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టి వుండాల్సిందనీ, అలా చేయకపోవడంతోనే, ఇప్పుడీ సమస్య వచ్చిందనీ వెంకయ్య చెబుతున్నారు. అసలు, 2017 మార్చ్‌ తర్వాత ఏ రాష్ట్రానికీ దేశంలో ప్రత్యేక హోదా వుండదని ఓ పక్క చెబుతూ, ఇంకోపక్క ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకపోవడం వల్లే ప్రత్యేక హోదా రాలేదని వెంకయ్య చెప్పడమేంటట.? 

ఏదిఏమైనా, బీజేపీ - పవన్‌కళ్యాణ్‌ని ఫుల్లుగా వాడేసుకుంది. సేమ్‌ టు సేమ్‌ టీడీపీ కూడా. అఫ్‌కోర్స్‌, ఆ రెండు పార్టీల పేరు చెప్పి, జనసేన పార్టీ అధినేతగా పవన్‌కళ్యాణ్‌కీ కాస్తో కూస్తో పొలిటికల్‌ మైలేజ్‌ (ప్రచారం పరంగా) దక్కిందనుకోండి.. అది వేరే విషయం. ఈ 'వాడకం' ఇంకా పవన్‌కళ్యాణ్‌కి అర్థం కాలేదో, అర్థమయ్యీ.. అవనట్లు వ్యవహరిస్తున్నారోగానీ, వెంకయ్యనాయుడు మాత్రం 'పవన్‌కళ్యాణ్‌ని అలా వాడుకున్నాం' అని జస్ట్‌ ఆయనకి గుర్తు చేస్తున్నారంతే.

Show comments