గులాబీదళం మార్పు కోరుకుంటోందా.?


'జై ఆంధ్ర.. జై తెలంగాణ.. జై హింద్‌..' అంటూ కవిత విదేశాల్లో తెలుగువారంతా 'ఐక్యంగా వుండాలి' అనే సంకేతాల్ని పంపడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. 'రాష్ట్రాలుగా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసే వుందాం..' అన్నది తెలంగాణ ఉద్యమ నినాదం. ఉద్యమ నినాదం వేరు, ఉద్యమం నడిచిన తీరు వేరు. ఉద్యమంలో భాగంగా ఆంధ్రోళ్లని తెలంగాణ వాదులు తరిమికొట్టిన సందర్భాలు కోకొల్లలు. 'అంత పెద్ద ఉద్యమంలో చిన్న చిన్న ఘటనలు సహజమే..' అని తెలంగాణ వాదులు చెప్పుకోవచ్చుగాక, కానీ జరిగిన దాడుల విషయంలో ఏనాడూ 'చింత' వ్యక్తం చేయలేదు గనుక.. ఉద్యమం వెనుక ఉద్దేశ్యమే అనుమానాస్పదమయ్యింది. 

గతం తగతః అయ్యిందేదో అయిపోయింది, ఇకపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగువారు ఎప్పటికీ కలిసే వుండాలన్న అభిప్రాయం రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజల నుంచీ వ్యక్తమవుతోంది. కానీ, రాజకీయ పార్టీలు ఊరికే వుంటాయా.? వుండవుగాక వుండవు. తెలంగాణలోని ప్రాజెక్టుల్ని ఆంధ్రప్రదేశ్‌ అడ్డుకుంటోందనీ, ఆంధ్రప్రదేశ్‌కి నీరెళ్ళకుండా తెలంగాణ అడ్డుపడుతోందనీ రాజకీయంగా రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ రచ్చ ఇరు రాష్ట్రాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది. 

అంతిమంగా రాజకీయ నాయకులంతా ఒక్కటే. చంద్రబాబు పిలిస్తే, కేసీఆర్‌ అమరావతికి వెళ్ళలేదా.? కేసీఆర్‌ ఆహ్వానిస్తే చండీయాగానికి చంద్రబాబు హాజరు కాలేదా.? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అన్నాడట వెనకటికి ఒడు. స్నేహం స్నేహమే.. గొడవలు గొడవలే అన్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులూ వ్యవహరిస్తున్నారు. అంతేనా, వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణలోని ఆంధ్రోళ్ళపై టీఆర్‌ఎస్‌ నేతలు అప్పుడప్పుడూ నోరు పారేసుకుంటుంటారు. కవిత తక్కువేం తిన్లేదు, ఆమె నోట అలవోకగా ఆంధ్రోళ్ళపై విమర్శలు వచ్చేస్తాయి. 

అందుకే, కవిత 'జై ఆంధ్రా' అన్నా, ఆమె మాటల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. విదేశాల్లో వివాదాలు కొనితెచ్చుకోవడమెందుకని అలా అని వుంటారంతే. 'జై తెలంగాణ' అనేసి ఊరుకున్నా ఆమెను ఎవరూ ఏమీ అనరుగానీ, నిర్వాహకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారుండడంతో వారి మెప్పు కోసం అప్పటికి అలా కానిచ్చేశారు కవిత. పైగా, కేంద్రంలో మంత్రి పదవిని ఆశిస్తున్న కవిత, 'పడి వుంటుందిలే..' అంటూ 'జై ఆంధ్రా' నినాదం కూడా చేశారని అనుకోవాలేమో. 

పొద్దున్న లేస్తే బీజేపీని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించేస్తుంటారు. మంత్రి కేటీఆర్‌ ఇందుకు మినహాయింపేమీ కాదు. అదే సమయంలో కేంద్రంతో పనిచేయడానికి సిద్ధమనీ, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఏదైనా చేస్తామనీ మొన్నామధ్య కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలిసిన సందర్భంలో నినదించారాయన. కేంద్రమేంటి, బీజేపీ ఏంటి.? టెర్మ్స్‌ వేరే అయినా.. అక్కడున్నదంతా ఒక్కటే కదా. ఏంటో ఈ రాజకీయం, ఇది ఎవరికీ అర్థం కాని రాజకీయం. 

అన్నట్టు, కవిత 'జై ఆంధ్రా' నినాదం తెలంగాణ రాష్ట్ర సమితిలో గందరగోళానికి తెరలేపిందట. ఇలాంటి నినాదాలు తెలంగాణ సమాజంలోకి తప్పుడు సంకేతాల్ని పంపుతాయంటూ అధినేత కేసీఆర్‌ వద్ద, కవిత వ్యాఖ్యలపై ఫిర్యాదులు కూడా వెళుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. మరి, అధినేత తన పుత్రికారత్నం 'జై ఆంధ్రా' అనడాన్ని ఎలా సమర్థించుకుంటారో.? ఆంధ్రోళ్ళతో పంచాయితీ అయిపోలేదంటూనే, జై ఆంధ్రా నినాదమెత్తుకోవడమంటే కాస్తంత చిత్రమైన విషయమేకదా. దటీజ్‌ టీఆర్‌ఎస్‌.

Show comments