బ్రాండ్‌ షబానా.!

బ్రాండ్‌ షబానా.. బాండ్‌ షబానా కాబోతోందా.? ఇకపై తాప్సీ నుంచి 'షబానా' బ్రాండ్‌తో 'బాండ్‌' తరహా సినిమాలు రాబోతున్నాయా.? అంటే, అవుననే సంకేతాలు ఇస్తోందామె. 

అక్షయ్‌కుమార్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో ఆ మధ్య 'బేబీ' సినిమా వచ్చిన విషయం విదితమే. అది అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. ఆ సినిమాలోని తాప్సీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో కన్పించింది. తాప్సీ ఆ సినిమా కోసం చూపిన తెగువ చూసి, పూర్తిస్థాయి యాక్షన్‌ గర్ల్‌గా చూపించాలన్న ఆలోచన మరింత బలపడిందట. అలా ’నామ్ షబానా‘కి బీజం పడింది. ’బేబీ‘ సినిమాకి ప్రీక్వెల్‌.. అంటూ 'నామ్‌ షబానా' సినిమాని తెరకెక్కడం, ఈ సినిమాపై ఎవరూ ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్‌ అవడం చూశాక, 'షబానా'ని ఓ బ్రాండ్‌గా మార్చెయ్యాలనుకుంటున్నారు. 

'ముందు ముందు షబానాకి సీక్వెల్స్‌ రావొచ్చు.. ఇది బాండ్‌ తరహాలో వుంటుందేమో..' అంటూ తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. సినిమా రిలీజ్‌కి ముందు ఈ తరహా పబ్లిసిటీ స్టంట్స్‌ మామూలేనని తాప్సీ వ్యాఖ్యలపై కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే, ఈ విషయంలో తాప్సీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. మరోపక్క, తాప్సీ, చాలా సీరియస్‌గా 'నామ్‌ షబానా' సినిమా ప్రమోషన్స్‌ చేసేస్తోంది. తానే ఈ చిత్రానికి నిర్మాతననే స్థాయిలో తాప్సీ చేస్తున్న హడావిడి చూసి బాలీవుడ్‌ సినీ జనం సైతం ఆశ్చర్యపోతున్నారు. 

మార్చ్‌ 31న 'నామ్‌ షబానా' సినిమా విడుదల కానుంది. సినిమాకి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి, తాప్సీ 'షబానా'ని తానే సొంతంగా బ్రాండ్‌గా మార్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 'షబానా' సిరీస్‌తో తాప్సీ నిర్మాతగా మారుతుందా.? వేచి చూడాల్సిందే.

Show comments