ఇప్పటి వరకూ చాలా అంశాలకు సంబంధించి దీక్షలనే చేపట్టాడు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా అంశం విషయంలో ఢిల్లీలో కూడా దీక్ష చేపట్టిన జగన్ ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తూ దీక్షలు, యాత్రలు చేపడుతున్నాడు. ఏ హామీలైతే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశాయో.. అవే హామీలను అధికారం సాధించుకున్న తెలుగుదేశం పార్టీ అమలు చేయలేకపోతున్న తరుణంలో జగన్ మోహన్ రెడ్డి వాటిపై దృష్టి సారించాడు.
ఎక్కువమందిని ప్రభావితం చేసే.. ఎక్కువమంది ఆశలు పెట్టుకుని ఓట్లేసిన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి అంశాల విషయంలో జగన్ ఇప్పటికే ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాడు. వీటి విషయంలో జగన్ ప్రజల్లోకి వెళ్లి చేసిన వ్యాఖ్యలు జనాల్లోకి కూడా బాగా వెళ్లాయి. హామీలు నిలబెట్టుకోని చంద్రబాబుకు చీపుర్లు, చెప్పులు చూపించాలన్న జగన్ వ్యాఖ్య జనాల్లోకి వెళ్లింది. ఎలాగూ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ బాధితుల సంఖ్య తీవ్ర స్థాయిలో ఉండటంతో… జగన్ వ్యాఖ్యలు జనాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మరి వీటి సంగతిలా ఉంటే… కాపునాడు వాళ్లు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా ఉంది. కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్ దీక్షను చేపట్టాలని కాపునాడు విజ్ఞప్తి చేసింది. విజయవాడలో జగన్ పార్టీ కార్యక్రమం జరుగుతున్న చోటకు వచ్చి కాపునాడు నేతలు జగన్ ను దీక్ష చేపట్టాలని కోరారు. కాపులకు రిజర్వేషన్ల అంశం వేడి మీద ఉన్న నేపథ్యంలో కాపునాడు నేతల విజ్ఞప్తి ఆసక్తికరంగా ఉంది. ఎలాగూ ఈ రిజర్వేషన్ల అంశం తెలుగుదేశం ఎన్నికల హామీల్లో ఒకటి. రుణమాఫీ అంశానికి ధీటుగా రిజర్వేషన్ల అంశం కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసింది.
మరి ఈ హామీ అమలు విషయంలో ఇప్పటి వరకూ వచ్చిన, వస్తున్న ఒత్తిళ్ల వెనుక జగన్ హస్తం ఉందని తెలుగుదేశం వారు క్రమం తప్పకుండా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముద్రగడ వెనుక జగన్ ఉన్నాడనేది తొలి రోజు నుంచి తెలుగుదేశం చెబుతున్న మాట. ఇలాంటి నేపథ్యంలో ముద్రగడ దీక్ష వేడి మీద ఉన్న సమయంలో కాపునాడు విజ్ఞప్తి మేరకు జగన్ గనుక కాపు రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అంటూ దీక్ష చేస్తే.. తెలుగుదేశం మరింత ఇరకాటంలో పడే అవకాశం ఉంది.