కోదండరాం పార్టీ పెడితే వాళ్ల దుకాణం బందే!

ప్రొఫెసర్ కోదండరాం అడుగులు నెమ్మదిగా కొత్త పార్టీ స్థాపన దిశగా పడుతున్నాయి. అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ప్రస్తుతం రేగుతున్న సంచలనం యావత్తూ కొత్త పార్టీ దిశగా సానుకూల సంకేతాలే అని కోదండరాం కోటరీ భావిస్తున్నది. తెలంగాణ కోసం కేసీఆర్ తో సమానంగా పోరాటాన్ని నడిపించారనే కీర్తి దక్కించుకున్నప్పటికీ.. రాజకీయంగా అసలు నామమాత్రపు స్థానం కూడా దక్కని వైనం.. ఆయనను లోలోన సొంత పార్టీ స్థాపన దిశగా ప్రేరేపించి ఇన్నాళ్లకు అనుకూల వాతావరణం ఏర్పడిందనే నమ్మకాన్ని కలిగిస్తుండవచ్చు. కోదండరాం పార్టీ పెడతారనే ప్రచారం , పుకార్లు, గులాబీ వర్గాల దెప్పిపొడుపులు చాలా కాలంగా వినవస్తూనే ఉన్నాయి. అందులో ఆశ్చర్యపోయేంత కొత్త సంగతి లేదు. కాకపోతే.. తాజాగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే.. కోదండరాం పార్టీ పెడితే.. కొన్ని పార్టీలు ఖాళీ అవుతాయేమోనని!

తెలంగాణలో ప్రస్తుతం గులాబీ పార్టీ ఒక్కటే హవా నడిపిస్తోంది. రాజకీయంగా వైరిపక్షాలను కాలరాసే వ్యూహాలతో వారు చాలా దెబ్బలు కొట్టారు. కేవలం అసెంబ్లీలో బలం రూపంలో మాత్రమే కాదు.. రాష్ట్రంలో ప్రజాదరణ రూపంలో కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు గులాబీ దెబ్బకు కుదేలైపోయాయి. అయితే గత్యంతరం లేక, గులాబీ పార్టీలో ఎంట్రీలేక, తీవ్రమైన భావ వైరుధ్యం ఉన్న కొద్ది మంది మాత్రమే ఆయా పార్టీల్లో కొనసాగుతున్నారు. అయితే ఆ పార్టీల్లో తమకు రాజకీయంగా ఏ మేరకు భవిష్యత్తు ఉంటుందనే విషయంలో వారికే గ్యారంటీ లేదు. కాంగ్రెస్ భవిష్యత్తు అధికారం దిశగా నడవగలదని ధీమాగా చెప్పగలవారు లేరు. తెలుగుదేశానికైతే ఊహలకు కూడా అందని సంగతి. 

ఇలాంటి నేపథ్యంలో కోదండరాం గనుక కొత్త పార్టీ పెడితే.. కాంగ్రెస్, తెలుగుదేశం శ్రేణుల్లోని అనేక మంది అందులోకి జంప్ చేసేస్తారనే ప్రచారం బాగా వినవస్తోంది. కాంగ్రెస్ లో అసలే ముఠా కుమ్ములాటలు తారస్థాయిలో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇలా కొట్టుకుంటూ ఉంటే.. ఇక అధికారంలోకి వచ్చేట్లయితే వారి మధ్య సయోధ్య ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. అక్కడ అసంతృప్తితో వేగిపోతున్న వారు అనేకులు ఉన్నారు. సామాజిక వర్గ సమీకరణాలను కూడా ప్రధానంగా ఎంచే వారున్నారు. వారంతా కూడా కోదండరామ్ స్థాపించే పార్టీలోకి వెళ్లిపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కంటె కూడా తెదేపాకు ఇంకా పెద్ద దెబ్బ పడుతుందనే ప్రచారం ఉంది. చాలా చోట్ల పార్టీ ఖాళీ అయినా ఆశ్చర్యం లేదని పలువురు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల కార్యవర్గం కోసం కూడా మనుషులు దొరకని స్థితిలో ఆ పార్టీ ఉంది. ఇక కోదండరాం కూడా పార్టీ గా రూపుదాలిస్తే.. తెలంగాణ లో రాజకీయ సమీకరణలు సమూలంగా మారుతాయని అనుకోవచ్చు. 

Readmore!
Show comments