అయ్యయ్యో బాలయ్యా ఇదేంటయ్యా.!

నందమూరి బాలకృష్ణ.. స్వర్గీయ నందమూరి తారకరామారావు సినీ 'లెగసీ'కి వారసుడే కాదు, పొలిటికల్‌ 'లెగసీ'కి కూడా వారసుడని 'నందమూరి' అభిమానులు భావించారు. కానీ, పొలిటికల్‌ 'లెగసీ' మాత్రం, నందమూరి కుటుంబంలో ఎవరికీ దక్కలేదు. స్వర్గీయ నందమూరి తారకరామారావుని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, వ్యూహాత్మకంగా పార్టీ పగ్గాలు దక్కించుకున్నారు. 

2019 ఎన్నికల్లో బాలకృష్ణకు ఎమ్మెల్యేగా ఛాన్స్‌ దక్కడంతో 'నందమూరి' అభిమానులు కాస్తంత సంబరపడ్డారు. 'కాబోయే సీఎం బాలయ్య..' అంటూ అంతకు ముందు విన్పించిన నినాదాలు, ఆ తర్వాత మరింత ఎక్కవయ్యాయి. అయితే, వ్యూహాత్మకంగా చంద్రబాబు ఆ 'నినాదాల్ని' అణగదొక్కేశారు. మంత్రి పదవి అయినా బాలయ్యకు దక్కుతుందా.? అని అభిమానులు ఎదురుచూశారుగానీ, ఆ ఛాన్స్‌ బాలయ్యకి ఇవ్వలేదు చంద్రబాబు. 

'నాకు పదవి అలంకారం కాదు.. నేనే పదవికి అలంకారం..' అంటూ బాలయ్య అప్పటికీ ఇప్పటికీ అవే గొప్పలు కొనసాగిస్తుండడం, చంద్రబాబుకి భలేగా కలిసొస్తోంది. కానీ, అభిమానులకంటూ కొన్ని 'ఆశలు' వుంటాయి కదా.! తమ అభిమాన హీరో సినిమా రికార్డులు కొల్లగొట్టాలని కోరుకోవడం, తమ అభిమాన హీరోని రాజకీయంగా అత్యున్నత స్థాయిలో చూడాలనుకోవడం.. ఇవన్నీ అభిమానుల కోరికలే. పైగా, స్వర్గీయ ఎన్టీఆర్‌ నట వారసుడు, రాజకీయ వారసుడు కూడా కావాలని అభిమానులు కోరుకోవడం తప్పెలా అవుతుంది.? 

'మహానాడు' వేదికగా బాలకృష్ణకు మరోమారు చుక్కెదురయ్యింది. 70 అడుగుల కటౌట్‌, మంత్రి నారా లోకేష్‌ కోసం ఏర్పాటు చేయగలిగారుగానీ, బాలకృష్ణ ఊసే లేకుండా పోయింది. అసలంటూ మహానాడులో బాలయ్య పేరే ఎక్కడా విన్పించకపోవడం గమనార్హం. ఇదంతా, చంద్రబాబు వ్యూహం ప్రకారమే జరిగిందన్నది నిర్వివాదాంశం. నిజానికి, బాలయ్యని హైలైట్‌ చేస్తే, టీడీపీ ఇమేజే పెరుగుతుంది. ఎందుకంటే, బాలయ్యకి వున్న సినీ గ్లామర్‌ అలాంటిది. 

కొసమెరుపు: పార్టీ పరంగా బాలయ్య పరిస్థితి ఇలా వుంటే, నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన పరిస్థితి ఇంకా దారుణం. నియోజకవర్గ ప్రజలు, తమ ఎమ్మెల్యేపై తిరగబడే పరిస్థితుల్ని అక్కడ 'క్రియేట్‌' చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా నియోజకవర్గం వైపు బాలయ్య కన్నెత్తి చూడకపోవడం, సొంత నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో కుమ్ములాటలు.. ఇవన్నీ బాలకృష్ణ ఇమేజ్‌ని పొలిటికల్‌గా సమాధి చేసే ప్రయత్నాల్లో భాగమని అనుకోవచ్చా.?

Show comments