పెద్దాయన మాటలు నవతరానికి చురకలే!

మొన్నమొన్నటి వరకు తమిళనాడు గవర్నర్‌గా సేవలందించిన కొణిజేటి రోశయ్య ఇప్పుడు విరామ జీవితం గడుపుతున్నారు. పదవీవిరమణ తర్వాత శేషజీవితం హైదరాబాదులోనే గడపబోతున్నట్లు ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. రోశయ్యకు వివాదరహితుడిగా పేరుంది. అయిదుగురు కాంగ్రెస్‌ దిగ్గజాల వంటి నాయకులులు ముఖ్యమంత్రులుగా ఉండగా, వారందరి కేబినెట్‌లలో ఆర్థికమంత్రిగానే సేవలందించిన అరుదైన రికార్డు రోశయ్యకు ఉంది. 18 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి ఆయన. ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి రోశయ్య.. గవర్నర్‌గా పదవీవిరమణ చేసిన తర్వాత.. తన జీవితానుభవాల్ని పుస్తకంగా రాయాలని మాత్రం అనుకోవడం లేదంటూ.. చెప్పడం విశేషం. తానేమీ గొప్పవాడిని కానని, తన గురించి భావితరాలకు తెలియాల్సినంత గొప్ప సంగతులేమీ లేవని ఆయన అంటున్నారు. 

అయితే అదే సమయంలో సమకాలీన రాజకీయాల గురించి రోశయ్య ప్రస్తావించిన కొన్ని మాటలు మాత్రం చాలా మంది రాజకీయ నాయకులకు చురకలు అంటించేవిగానే ఉన్నాయి. రోశయ్య నిండుగా 60ఏళ్లు దాటిన రాజకీయ జీవితం అనుభవించారు. అయితే తన వారసులను తయారు చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదని ఆయన అంటున్నారు. ఒక వారసుడిని జుట్టు పట్టుకుని పైకి తీసుకువచ్చి, 'నా వారసుడు' అంటూ పరిచయం చేయాలనే కోరిక తనకు అసలు లేదని చెబుతున్నారు. 

ఇప్పటి రాజకీయాల్లో ఎటుచూసినా కనిపించేవి వారసత్వ రాజకీయాలు మాత్రమే. ఎవడైనా ఒకడు ఒకసారి ఒక పదవిలోకి వచ్చాడంటే.. ఆ రోజునుంచే తన తదనంతరం తన కొడుకు ఆ పదవిలోకి రావడానికి పునాదులు వేయడం ప్రారంభిస్తున్న రోజులివి. పైగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు కూడా తమ వారసుల్ని ప్రముఖంగా తెరమీదకు తేవడం మీదనే పూర్తి శ్రద్ధ పెట్టి అందుకోసం తహతహలాడిపోతున్నారు. ఆ మాటకొస్తే ముఖ్యమంత్రులు మాత్రమే కాదు.. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా.. తమ తమ వారసుల రాజకీయ జీవితాలకు పునాదులు వేయడంలోనే నానా పాట్లు పడుతూ ఉండడం మనకు కనిపిస్తుంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఎంతో అనుభవజ్ఞుడైన రోశయ్య మాటలు ఒక రకంగా ఈ నాయకుల అనుచితమైన వారసత్వపు ఆశల మీద వేసిన సెటైర్లలాగానే ఉన్నాయి మరి!

Show comments