భూమా కోరిక 'అఖిల'తో నెరవేరుతుందా?

చిన్న వయసులోనే అంటే 53 ఏళ్లకే భూమా నాగిరెడ్డి చనిపోవడం అత్యంత విషాదం. మూడేళ్ల క్రితం ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య శోభను కోల్పోయిన నాగిరెడ్డి ఇప్పుడు తానే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కూతురు అఖిలప్రియ ఆయన అండదండలతో రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో సంభవించిన ఈ విషాదం నుంచి ఆ కుటుంబం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేననిపిస్తోంది. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు నిలయమైన కర్నూలు జిల్లాలో, అందులోనూ ఆళ్లగడ్డలో అఖిలప్రియ రాజకీయంగా తట్టుకొని నిలబడగలదా? ఆమెకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ పూర్తి సహాయం చేయాల్సివుంటుంది. రాజకీయంగానే కాకుండా ప్రత్యర్థుల బారి నుంచి ఆమెను కాపాడాల్సివుంటుంది. భూమా నాగిరెడ్డికి సంబంధించి చెప్పుకోవాల్సిన విశేషమేమిటంటే టీడీపీ ద్వారానే రాష్ట్ర రాజకీయాల్లోకి (ఉమ్మడి రాష్ట్రంలో) అడుగుపెట్టిన ఆయన అదే టీడీపీలో చేరిన (వైఎస్సార్‌సీపీ నుంచి) కొంతకాలానికే కన్నుమూశారు. అంటే ఆయన తుది మొదలు టీడీపీయేనన్నమాట.

1984లో సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో రాజకీయాల్లోకి వచ్చిన భూమా ఆ తరువాత ఆళ్లగడ్డ మండలాధ్యక్షుడయ్యారు. దీని తరువాతే ఆయన అసలు రాజకీయ జీవితం ప్రారంభమైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు భూమా శేఖర రెడ్డి చనిపోవడంతో 1991లో ఆళ్లగడ్డకు జరిగిన ఉప ఎన్నికలో నాగిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడది ప్రతిపక్షం. ఆయన చనిపోయే సమయానికి మళ్లీ టీడీపీలోనే ఉన్నారు. ఇప్పుడది అధికార పక్షం. అయితే ఆయన వైకాపా నుంచి టీడీపీలోకి జంప్‌ చేసినా ఆ పార్టీ నుంచి వచ్చిన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయలేదు కాబట్టి నైతికంగా ఆయన జగన్‌ పార్టీ ఎమ్మెల్యే అవుతారు. కాని ఇప్పుడీ విషయం ఎవ్వరూ పట్టించుకోవడంలేదు కాబట్టి టీడీపీ ఎమ్మెల్యేగానే భావించాలి. 1996లో భూమా పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది.

కారణం... నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం. కాని కొద్ది తేడాతో ఓడిపోయారు. అయితే పీవీ నంద్యాలతోపాటు ఒడిశాలోని బరంపురం నుంచి కూడా పోటీ చేసి అక్కడా గెలిచారు. దీంతో నంద్యాలకు రాజీనామా చేశారు. దీంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెసు అభ్యర్థి రంగయ్య నాయుడిని నాలుగు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఓడించారు. దీంతో భూమా బలమైన నాయకుడిగా అవతరించి మొదటిసారిగా లోక్‌సభలో కాలుపెట్టారు. ఆ తరువాత మరో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికై రాయలసీమలో భూమాను దెబ్బతీసేవాడు లేడనే అభిప్రాయం కలిగించారు. ఆయన టీడీపీ నుంచి పెద్ద నాయకుడిగా ఎదిగినప్పటికీ 2008లో ఆ పార్టీని వదిలేసి చిరంజీవి ప్రజారాజ్యంలో చేరారు. 2009 ఎన్నికల్లో ఆయన, భార్య శోభ ప్రజారాజ్యం నుంచి పోటీ చేయగా ఆమె గెలిచింది. ఆయన ఓడిపోయారు. 2011లో వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. 

2014 ఎన్నికల్లోనే శోభ చనిపోయారు. ఆమె స్థానంలో కూతురు అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలిచింది. గత ఏడాది తండ్రీ కూతురు టీడీపీలోకి వచ్చేశారు. భూమా టీడీపీలో చేరగానే చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇస్తానని వాగ్దానం చేశారు. మంత్రి కావాలనేది ఆయన కోరిక కూడా. మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ అదుగో ఇదుగో అంటూ బాబు వాయిదా వేస్తూ వచ్చారు. ఈలోగా భూమా హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన పోయినా బాబు ఇచ్చిన 'మంత్రి పదవి' హామీ అలాగే ఉంది. అఖిలప్రియకు పదవి ఇచ్చి భూమా కోరిక నెరవేరుస్తారా? లేదా రాజకీయంగా, ఇతరత్రా ఏమైనా అడ్డంకులు వస్తాయా? అఖిలప్రియను పక్కకు పెడితే భూమా వర్గం ఎలా స్పందిస్తుంది? ఈ ప్రశ్నలకు ఎలాంటి జవాబులు వస్తాయో చూడాలి.  Readmore!

Show comments

Related Stories :