పవన్‌కళ్యాణ్‌.. ఏం చెప్పాడండీ.!

అబ్బబ్బ.. ఏం చెప్పాడండీ పవన్‌కళ్యాణ్‌. అవును, ఇంతకీ ఏం చెప్పాడు.? ఏమో మరి, ఏదో చెప్పాడు. అది అర్థమయినట్లూ, అర్థమవనట్లూ.. ఏదోలా వుందది. అదే పవన్‌కళ్యాణ్‌ అంటే. ఆయనకి, సినిమాలు పెద్దగా 'కిక్‌' ఇవ్వవట. ప్రజలకు సేవ చేయాలన్నదే తన ఆలోచన అట. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదంటాడాయన. అధికారం కోసం పార్టీ పెట్టలేదట. రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలన్నదే తన ఆలోచన అని చెప్పుకొచ్చాడు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత.. పవర్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. 

సినిమాలు అంతగా కిక్‌ ఇవ్వనప్పుడు, ఇంకా సినిమాల్లో ఎందుకట.? ఏమో మరి, ఆయనకే తెలియాలి. తనకు డబ్బు అవసరం.. ఆంతే తప్ప, అదే లోకం కాదంటాడు. సినిమాల్లో కొనసాగుతున్నది డబ్బు కోసమేనని మొన్నామధ్య ఓ బహిరంగ సభలో సెలవిచ్చాడు. ప్రజా సమస్యల పట్ల ఆలోచన ఎక్కువని పవన్‌కళ్యాణ్‌ చెప్పడం వింటూనే వున్నాం. కానీ, ఆ సమస్యలపై ఆయన ఫోకస్‌ పెట్టింది చాలా తక్కువ. అదే, సినిమాల విషయానికొస్తే, ఇప్పుడు క్షణం తీరిక లేకుండా వున్నాడు పవన్‌కళ్యాణ్‌. 

అన్నయ్య పొలిటికల్‌ ఎంట్రీ ఏమయ్యిందో దగ్గరుండి చూసిన పవన్‌, రాజకీయాల విషయంలో ఆచి తూచి అడుగులేయడాన్ని తప్పు పట్టలేం. కానీ, సినిమాల్ని మించి రాజకీయాల్లో ఏకాగ్రత చూపించాలి కదా.! కానీ, ఆ ఏకాగ్రత అనేదే పవన్‌కళ్యాణ్‌లో కన్పించదు. అక్కడే వస్తోంది సమస్య అంతా. పార్టీని ప్రకటించేస్తే సరిపోదు, దాని నిర్మాణంలోనూ శ్రద్ధ చూపించాలి. ఆ పార్టీ నిర్మాణం ఓ కొలిక్కి వస్తే, పవన్‌ మాట్లాడకపోయినా, ఆయన తరఫున ఎవరో ఒకరు మాట్లాడతారు. 

మూడేళ్ళు దాటేస్తోంది పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించి. ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల నాటికి ఏమవుతుందో తెలియదు. ఈలోగా పవన్‌కళ్యాణ్‌ నుంచి సినిమాలు వస్తూనే వున్నాయి. ఇదంతా చూశాక, పవన్‌కళ్యాణ్‌కి రాజకీయాలపై ఆసక్తి వుందనుకోవాలా.? లేదనుకోవాలా.? ఆయన చెబుతున్నట్లుగా సినిమాల్లో 'కిక్‌' లేదని అనగలమా.? 

Readmore!

అమెరికా పర్యటనలో బిజీగా వున్న పవన్‌, అక్కడ కొందరు అడిగిన ప్రశ్నలకు పై విధంగా, తనదైన స్టయిల్లో.. అర్థం అయ్యీ కాకుండా.. సమాధానమిచ్చేశాడు. దటీజ్‌ పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌.

Show comments