సారీ..బాబుగారూ..ఇది మీ లెవెల్ కు తగదు

వయసు వస్తుంటే మన ప్రవర్తన హుందాగా మారాలి. అనుభవం, పెంచుకున్న జ్ఞానం, ఇవన్నీ కలగలసి ఒక పెద్ద తరహాను ఆపాదించాలి. అందుకు తగ్గట్టు మాట, ప్రవర్తన మారాలి. సింపుల్ లాజిక్ లో చెప్పాలంటే, స్కూలులో, కాలేజీల్లో అల్లరి చిల్లరి కుర్రాళ్లు మాస్టార్లకి నిక్ నేమ్ లు పెడతారు కానీ, మాస్టర్లు పిల్లలను ముద్దుగా వెధవా..అనే కసురుకుంటారు.

చంద్రబాబు అనుభవజ్ఞుడు. అన్ని విధాలా, అనేక యుద్దములందు ఆరితేరినవాడు. జగన్ చిన్నవాడు. ఇప్పుడిప్పడే రాజకీయాలు నేర్చుకుంటున్నవాడు.  డబ్బు సంపాదన, వ్యాపారం ఇవన్నీ పక్కన పెడదాం. అవి అందరికీ వున్నాయి. ఎవరి లొసుగులు వారికి వున్నాయి. వ్యాపారాల్లో ఎదుగుదల కోసం ఎవరి పనులు, ఎవరి వ్యూహాలు వారికి వుంటాయి. 

అంతెందుకు ప్రస్తుతం బాబుగారి కుటుంబం ఆధీనంలో వున్న హెరిటేజ్ సంస్థను ముందు ఎవరు ఎవరు భాగస్వాములుగా ప్రారంభించారు. మోహన్ బాబు, బాలకృష్ణ కూడా అందులో భాగస్వాములేగా? మరి వారు ఎలా పక్కకు తప్పుకోవాల్సి  వచ్చింది. ఆపై మోహన్ బాబు గతంలో బాబుపై ఈవిషయంపై ఎలా విమర్శలు చేసారు. అంతెందుకు తిరుపతి విష్ణుప్రియ హోటల్ వ్యవహారంలో ఎన్టీఆర్ సిఎమ్ గా వున్నపుడు బాబుగారిపై ఎన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత దాన్ని ఆయన కాంగ్రెస్ నాయకుడికి ఎలా బదలాయించారు.

అందువల్ల వ్యాపారాల సంగతి పక్కన వుంచి, రాజకీయాలు చూద్దాం. బాబు అనుభవశాలి. జగన్ చిన్నవాడు. ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఈయన అధికారం రిటైన్ చేసుకోవాలని చూస్తారు. ఆయన అందుకోవాలని చూస్తారు. ఇది కామన్.

మరి ఈ విషయం మరిచిపోయి, తన స్థాయికి దిగజారి చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చిత్రంగా వుంటున్నాయి. జగన్ సభలకు మీ పిల్లలను పంపించకండి. చెడు మార్గాలు నేర్పతాడు అని బాబు అనడం ఆయన స్తాయికి ఎంత మాత్రం తగదు కదా?

 మరి బాబు సభలకు పిల్లలను పంపించండి. కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడానికి వీలుగా ముందస్తు ఆలోచనలు చేయడం ఎలా? రెండు ఎకరాల నుంచి వేల కోట్లకు ఎదగడం ఎలా? పక్కవాడి పార్టీని లాక్కోవడం ఎలా? వారసత్వ రాజకీయాలను తిట్టిన పార్టీలో వుంటూ, కొడుక్కు పగ్గాలు అప్పగించడం ఎలా? ఇలాంటివి నేర్పుతారు అని వైకాపా వాళ్లు అనడం ప్రారంభిస్తే ?. ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి ప్రతిపక్షాన్ని పద్దతిగా ఎదుర్కోవడానికి చూడాలి కానీ, తల్లి తండ్రులూ మీ పిల్లల్ని జగన్ సభకు పంపకండి అనడం ఏమిటి? 

అంటే జగన్ సభలకు పిల్లలు వెళ్తే, అతని మాటలు నమ్ముతారన్న భయం బాబు మాటల వెనుక వినిపిస్తోందిగా? ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, హోదా వ్యవహారం, నోటుకు ఓటు వ్యవహారం,  పచ్చటి పొలాల్లో రాజధాని వ్యవహారం వంటివి, కోర్టుల ద్వారా తప్పించుకోవడంలో బాబు ఘనాపాఠి. కానీ ప్రజా కోర్టులో వ్యవహారం మేనేజ్ మెంట్ లకు అందదు. కేవలం మీడియా మేనేజ్ మెంట్ నే మిగిలింది బాబుకు. ఆ మీడియా బాబు ఏదిశగా మాట్లాడితే, ఆ విధంగా వినిపించేలా చేస్తుంది. అందుకే ఈ విధంగా దిగజారి మాట్లాడినా, తల్లితండ్రులకు బాబు సుద్దులు చెప్పిన రీతిలో ఆయన అను’కుల’మీడియాలో ప్రతిధ్వనిస్తుంది. అదే ఆయన ధీమా.

Show comments