డౌట్: టీడీపీ అడ్డం తిరగదని నమ్మకముందా?

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి అయితే యాంటీ ప్రత్యేక హోదా స్టాండు తీసుకుని దాని మీద నిలబడ్డట్టుగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలోనే… రకరకాల మాటలు మార్చిన ఆ పార్టీ ప్రస్తుతానికి అయితే.. ప్రత్యేక హోదా వల్ల వచ్చేదేమీ లేదు, అందుకే తాము కేంద్రం ఇస్తున్న ప్యాకేజీతో సంతృప్తి పడుతున్నాం అనే మాట వినిపిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ప్రకటన చేశాడు.. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలేమిటో తనకు చెప్పాలని అయన చెప్పాడు.

మరి ఈయనేనా.. మొన్నామధ్య “రక్తం మరిగిపోతోంది..’’ అనే ప్రకటన చేసింది, ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంపై కేంద్రంపై మండి పడ్డది, కేంద్రం నిర్లక్ష్య పూరిత వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం నుంచి తన పార్టీ బయటకు వచ్చేస్తుంది జాగ్రత్తా.. అని హెచ్చరించింది? అనే సందేహాలు సహజంగానే వస్తాయి.

ఇప్పటి వరకూ చూస్తే.. ఒక్క “ప్రత్యేకహోదా’’ అనే అంశం గురించినే బోలెడు మాటలు  మార్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్నికల ముందు ప్రత్యేక హోదాతో అద్భుతాలు జరుగుతాయని, ఎన్నికలయ్యాకా.. “ప్రత్యేకహోదా సంజీవని కాదు..’’ అని ఒకసారి, ఇటీవలేమో “రక్తం మరిగిపోతోంది..’’ అనే డైలాగు వేసింది. ఈ విధంగా పరస్పరం విరుద్ధమైన మాటలు స్వయంగా తెలుగుదేశం అధినేత నోటి నుంచినే జాలువారాయి!

రెండేళ్లలోనే ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఒకసారి, ఆ తర్వాత వ్యతిరేకంగా మళ్లీ మరోసారి, ఆ తర్వాత మళ్లీ అనుకూలంగా మాట్లాడి.. చివరకు ప్రత్యేకహోదాతో ఏమీ రాదు.. అనే, దాని వల్ల ప్రయోజనం లేదు.. అనే స్లాండు మీదకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈ పార్టీ వైఖరి ఎలా ఉందంటే.. ప్రత్యేక హోదా అంటేనే, పళ్లు రాలగొడతాం.. అనే తీరున ఉంది.

మరి  రెండేళ్లలో ఇన్ని మాటలు అయ్యాయి.. మరి వచ్చే మూడేళ్లలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అనేది సగటు మనిషి ఊహకందని విషయం. తెలుగుదేశం పార్టీ నిజంగానే.. ప్రత్యేకహోదా అంశంపై ఇప్పుడు వ్యక్తపరుస్తున్న అభిప్రాయానికే స్టిక్ ఆన్ అయి ఉంటుంది.. అంటే అది నమ్మే విషయంలా కనిపించడం లేదు.

ప్రస్తుతానికి కేంద్రంలో అధికారంలో పంచుకోవడానికి, కేసుల టెన్షన్ లేకుండా చేసుకోవడానికి మాత్రమే.. తెలుగుదేశం పార్టీ “ప్రత్యేకహోదా’’ విషయంలో సంతృప్తి అనే వైఖరిని వ్యక్తం చేస్తోంది. మరి రేపు ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి.. ఇదే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది పరిశీలకుల మాట!

ఇప్పుడు కేంద్రం వైఖరిపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం నేతలు.. రేపటి ఎన్నికల సమయానికి, “బీజేపీ అన్యాయం చేసింది…’’ అని అని అంటారు చూడండి అని కొంతమంది బెట్ కాయడానికి రెడీగా ఉన్నారు. మూడేళ్లు గడిచి.. ఎక్కడి గొంగళి అక్కడే అనే పరిస్థితిల్లో ఎన్నికలు జరిగిన పక్షంలో.. తన మనుగడ కోసం తెలుగుదేశం అధినేత బీజేపీ అన్యాయం చేసింది, ప్రత్యేకహోదా ఇవ్వలేదు, నిధుల విషయంలో కూడా అన్యాయం జరిగింది.. అని వాదించగలడు.. అనేది వీరి అంచనా.

ఎన్నికల నాటికి పెల్లుబికే ప్రభుత్వ వ్యతిరేకతను డైల్యూట్ చేయడానికి బీజేపీ తో తెగదెంపులు చేసుకుని.. ఈ ఐదేళ్ల ఫెయిల్యూర్ కి అంతా కారణం కమలనాథులే, ఎంతో సర్దుకుపోయినా… న్యాయం చేయలేదు, రెక్కలు విరగొట్టారు.. అని బాబు వాదిస్తాడని, బీజేపీని నమ్ముకున్నందుకు అన్యాయం జరిగింది. అక్కడికీ, తను ఎంతో చేశాను, ఎంతో కష్టపడ్డాను అంటూ అప్పటికి బాబు ఆ వాదనతో, ఆ విధంగా జనం ముందుకు పోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తో వైరం మంచిది కాదు అని ఇన్ని రోజులూ సర్దుకుపోయాను.. ఇక రాజీ పడే ప్రసక్తే లేదు, అని బాబు 2019 ఎన్నికల నాటికి వాదించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీపై ఎవరికైనా భ్రమలు ఉంటే అవి అప్పటికి పూర్తిగా తొలగిపోతాయి. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ మీదకు మళ్లించాలనే వ్యూహంతో పవన్ కల్యాణ్ ను అడ్డం పెట్టుకుని.. బాబు  ఎన్నికల నాడు అలా బరిలోకి దిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు బీజేపీ నేతలను సమర్థిస్తూ మాట్లాడినా, బీజేపీ తో సర్దుకుపోతున్నట్టుగా కనిపించినా.. “సంతృప్తి’ పడుతున్నా అనే ప్రకటనలు చేసినా.. ఎన్నికల సమయానికి మాత్రం మొత్తం కథను మార్చేసే తెలివి తేటలు బాబుకు ఉన్నాయి. అప్పటికి ఏదో ఒక తక్షణ కారణాన్ని చూపడం ఆయనకు కష్టమే కాదు, అనుకూల మీడియా చేత ఆ మేరకు ఆ వ్యూహాన్ని అమలు పెట్టించే నైపుణ్యమూ ఉంది. కాబట్టి ఇదే జరుగుతుందని కొంతమంది నొక్కి వక్కాణిస్తున్నారు. కాదనలేని వాదనే ఇది!

Show comments