ప్చ్‌.. చిరంజీవి లేరక్కడ.!

ఏదో జరిగిపోతుందనే హడావిడితో భుజాన బ్యాగ్‌ వేసుకుని, రెక్కలు కట్టేసుకుని ఢిల్లీలో వాలిపోయారు గత శుక్రవారం ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి. రాజ్యసభలో ఆ రోజు ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్‌ జరుగుతుందన్న ప్రచారంతో కాంగ్రెస్‌ జారీ చేసిన విప్‌ని గౌరవించి చిరంజీవి ఢిల్లీకి చేరుకుని, రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యారు. అయితే, అంతా తుస్సుమంది. ఆ రోజు రాజ్యసభలో ఓటింగ్‌ కాదు కదా, అసలు చర్చ కూడా జరగని పరిస్థితి. 

ఇక, తాజాగా ఈ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. ముందుగా రెండు గంటల సమయమే అనుకున్నా, అనుకున్నదానికి మించిన సమయం చర్చ జరిగినా, ఈ చర్చలో చిరంజీవి కన్పించలేదు. అత్యంత కీలకమైన సందర్భమిది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పలువురు రాజ్యసభ సభ్యులు తమ వాదనల్ని విన్పించారు. చిరంజీవి రాజ్యసభలో వుండి వుంటే, కాంగ్రెస్‌ తరఫున ఆయనకూ కాస్తో కూస్తో ఛాన్స్‌ దక్కేదే. 

సాధారణంగా చట్ట సభలకు ఖచ్చితంగా హాజరవ్వాలనే నిబంధన ఏమీ లేదు. కానీ, ఇక్కడ 'నైతికత' అనేది ఒకటుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ చిరంజీవిని, ఎమ్మెల్యేని చేసింది. రాజ్యసభకు పంపింది. కేంద్ర మంత్రిని చేసింది. అన్నిటికీ మించి, ఆంధ్రప్రదేశ్‌ చిరంజీవిని మెగాస్టార్‌ని చేసింది. అసలు ఆయన జన్మించిందే ఆంధ్రప్రదేశ్‌లో. అలాంటి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అత్యంత కీలకమైన విషయమంపై రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు చిరంజీవి డుమ్మా కొట్టడమంటే అంతకన్నా దారుణమైన విషయం ఇంకేముంటుంది.?

Show comments