ప్యాకేజీ కాటుకి.. 'చైతన్యం' దెబ్బ

కుక్క కాటుకి చెప్పు దెబ్బ సంగతెలా వున్నా.. ప్యాకేజీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని మభ్యపెడుతోన్న ఎన్డీయే ప్రభుత్వం కుయుక్తులకు, 'చైతన్య పథం' పేరుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (పేరుకి సాక్షి మీడియాదే అయినా, తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నది వైఎస్సార్సీపీనే) చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 

ఏం చేసినా, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తుందా.? అన్న విషయం పక్కన పెడితే, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీ పేరుతో అన్యాయం చేస్తున్నాయనే విషయాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కదా. ప్రతిపక్షంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అదే చేస్తోందిప్పుడు. ఓ పక్క వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌, ప్రత్యేక హోదాపై యువతలో అవగాహన పెంచేందుకు, వారిలో చైతన్యం పెంచేందుకు యువభేరీ సదస్సులు నిర్వహిస్తోంటే, ఇంకోపక్క సాక్షి మీడియా తరఫున 'చైతన్య పథం' కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో చైతన్య పథానికి మంచి స్పందన లభిస్తోంది. ఎక్కువగా వైఎస్సార్సీపీ నేతలు, ఆ పార్టీ మద్దతుదారులే వీటికి వస్తున్నారన్న ఆరోపణల సంగతెలా వున్నా, అక్కడ వ్యక్తమైన అభిప్రాయాలు మాత్రం నూటికి నూరుపాళ్ళూ స్వచ్ఛమైనవి. సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు వీటిని నిర్వహిస్తుండడంతో, రాజకీయ విమర్శలకు అవకాశం తక్కువగా వుంటోంది. అదే సమయంలో యువతకు ఎక్కువగా మాట్లాడే అవకాశం దక్కుతుండడం గమనార్హం. 

ప్యాకేజీ పేరుతో కేంద్రం తెరపైకి తెచ్చిన 'మేడిపండు'ని కోసి మరీ వివరంగా ప్రజల ముందుంచుతోంది చైతన్య పథం. అందులో పురుగులు తప్ప, వాస్తవాలు కన్పించడంలేదు. బీజేపీ నేతలు, చైతన్యపథంలో యువత అడుగుతున్న ప్రశ్నలకు నీళ్ళు నమలాల్సి వస్తోంది. అప్పుడు ప్రత్యేక హోదా కోసం వెంకయ్యనాయుడు జరిపిన పోరాటం అబద్ధమా.? ఇప్పుడు హోదాతో ఏమీ రాదని వెంకయ్య చెబుతున్నది అబద్ధమా.? అని యువత నిలదీస్తున్నారు.  Readmore!

ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుతనానికి గురైన దరిమిలా, ఇక్కడ చైతన్యం కాస్త ఎక్కువగానే కన్పిస్తుంది. అయితే, షరామామూలుగానే ఆ చైతన్యాన్ని రాజకీయ నాయకులు తొక్కిపెట్టేస్తారనుకోండి.. అది వేరే విషయం. రైల్వేజోన్‌ విషయంలో అయితే, బీజేపీ నేతలు సమాధానం చెప్పలేని పరిస్థితి. అసలు ప్యాకేజీ అన్న మాట కేంద్రం నుంచి రాలేదనీ, ప్రత్యేక సాయం పేరుతోనే కేంద్రం కథలు చెబుతోందనీ యువత ప్రశ్నిస్తున్నారు. కాదు, అది ప్యాకేజీ.. హోదాని మించిన ప్యాకేజీ.. అని బీజేపీ నేతలు చెప్పలేని పరిస్థితి. 

ప్రత్యేక ప్యాకేజీ - ప్రత్యేక హోదాని మించి వుందంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతూ చెబుతున్నా, యువతలో ప్యాకేజీ పట్ల ఖచ్చితమైన అవగాహన వుందనీ, ప్రత్యేక హోదాపై ఇంకా క్లారిటీ వుందనీ ఈ చైతన్య పథం ద్వారా అర్థమవుతోంది. అయితే, ఒక్క వైఎస్సార్సీపీనో, ఒక్క సాక్షి మీడియానో.. ఇలాంటివి చేపడితే అది సరిపోదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మీడియా సంస్థలూ ఒక్కతాటిపైకి రావాల్సి వుంది. ప్రజల వాయిస్‌ని ప్రభుత్వాల ముందుంచగలగాలి. కానీ, ఎవరి ప్యాకేజీ వారికి అందాక.. ఎవరైనా ప్రత్యేక హోదాపై ప్రజల తరఫున మాట్లాడతారా.? ఛాన్సే లేదు.

Show comments

Related Stories :