పవన్‌కళ్యాణ్‌కి తెలంగాణతో ఎంతటి అనుబంధం వుందనే విషయం పక్కన పెడితే, ఉత్తరాంధ్రతో మాత్రం ఆయనకు విడదీయరాని అనుబంధం వుంది. కారణం సినిమా పాఠాల్ని పవన్‌కళ్యాణ్ ఉత్తరాంధ్రలోనే నేర్చుకోవడమే కావొచ్చు. నటనలో మెలకువల్ని విశాఖపట్నంలో, మాస్టర్ సత్యానంద్ దగ్గర నేర్చుకున్నాడు పవన్‌కళ్యాణ్. ఆ రోజుల్లో ఉత్తరాంధ్ర మీద ఎనలేని మమకారం కూడా పవన్‌కళ్యాణ్ పెంచుకోవడంతోనే, ఇప్పటికీ అతని సినిమాల్లో ఉత్తరాంధ్రను గుర్తుకు తెచ్చేలా పాటో, డైలాగో, ఏదో ఒకటి వుంటుంది.
ఆ స్లాంగ్ అంటే పవన్‌కి విపరీతమైన అభిమానం కూడా. ఇప్పుడిదంతా ఎందుకంటే, పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి, 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదుగానీ, 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నాడు. అదీ ప్రత్యేకహోదా నినాదంతో. విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయడంలేదని ఆరోపిస్తున్న పవన్‌కళ్యాణ్, అందులోని ప్రత్యేక రైల్వే జోన్ అంశాన్నీ ప్రస్తావిస్తున్న విషయం విదితమే. ఎటూ ఉత్తరాంధ్రలో పవన్‌కళ్యాణ్‌కి విపరీతమైన ఫాలోయింగ్ వుంది. సామాజిక వర్గ సమీకరణాలు చూసుకున్నా, అక్కడా పవన్‌కళ్యాణ్‌కి కలిసొచ్చే అవకాశాలు ఎక్కువే.
విశాఖతోపాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ పవన్‌కళ్యాణ్‌కి పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అన్నిటికీ మించి రాయలసీమలా ఉత్తరాంధ్ర కూడా వెనకబాటుతనానికి గురైన ప్రాంతం. సో, పవన్‌కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తే గెలుపు నల్లేరుమీద నడేక. పైగా ఈ ప్రాంతంలో పార్టీకి మంచి పట్టు దొరికే అవకాశముంది.
మరి, పవన్‌కళ్యాణ్ ఉత్తరాంధ్రని తన సినిమాలకోసం వాడుకోవడమేనా.? రాజకీయాల్లోనూ వాడేసుకుని, రాజకీయంగా తాను లబ్ది పొంది, ఆ ప్రాంత అభివృద్ధికి ఏమైనా ప్రయత్నిస్తాడా.? రైల్వే జోన్ ఎటూ 2019 ఎన్నికల్లోపు వచ్చేలా కన్పించడంలేదు కాబట్టి, రైల్వే జోన్ నినాదంతో ఉత్తరాంధ్రలో పవన్ పోటీ చేస్తే.. బంపర్ మెజార్టీ దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి, వెళతాడా పవన్ అక్కడికి.!