90 శాతం బతుకు బస్టాండే.!

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పరిస్థితులు ఎలా వున్నాయి.? ఆన్‌లైన్‌ వినియోగం మాటేమిటి.? ఎక్కడ చూసినా క్యాష్‌లెస్‌ అనే మాట విన్పిస్తోంది సరే.. మరి, ఆ క్యాష్‌లెస్‌కి అనుకూలంగా దేశం సర్వసన్నద్ధంగా వుందా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు. ఏ ప్రశ్నకీ సరైన సమాధానం దొరకదు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్నే తీసుకుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్కల ప్రకారం, పెద్ద నోట్ల రద్దుతో 86 శాతం డబ్బు చెలామణీలో లేకుండా పోయింది. ఇంచుమించు తెలంగాణలోనూ పరిస్థితి ఇంతే. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. మరి, ఆన్‌లైన్‌ డబ్బు వినియోగం మాటేమిటి.? అంటే, పెద్ద నోట్ల రద్దు తర్వాత 10 శాతానికి ఆన్‌లైన్‌ వినియోగం పెరిగిందట. అంతకు ముందు ఈ లెక్క 6 శాతం మాత్రమే. 

నిజం నిప్పులాంటిది. దురదృష్టవశాత్తూ ఆ నిప్పుని సైతం, ఓ రకమైన మాయతో 'ఆర్పేస్తున్నారు'. రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయంతో, దేశం అప్పటికప్పుడు క్యాష్‌లెస్‌గా మారిపోదు. ఆన్‌లైన్‌ వినియోగం దేశంలో ఎంత.? అన్న ఆలోచన లేకుండా పెద్ద నోట్లను రద్దు చేసి పారేయడం, వాటి స్థానంలో కొత్త కరెన్సీని తగినంతగా తీసుకురాకపోవడంతో భవిష్యత్తు భయానకంగా కనిపిస్తోందిప్పుడు. 

తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ వ్యాలెట్‌ తెస్తామంటోంది, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ పర్స్‌ తెస్తామంటోంది. ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపుల కోసం ఏపీ పర్స్‌ని వినియోగించవచ్చన్నది చంద్రబాబు మాట. ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు చెల్లింపులకూ అనుగుణంగా టీఎస్‌ వాలెట్‌ని ఉపయోగించుకోవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నారు. అంటే, అరటిపళ్ళ బండి దగ్గరకు వెళ్ళి టీఎస్‌ వాలెట్‌ని ఉపయోగించుకోవాలేమో.! 

ఒక్కటి మాత్రం నిజం.. మార్కెట్‌లోకి తగినంతగా కరెన్సీ వచ్చే పరిస్థితుల్లేవు. కాబట్టి, వున్న టెక్నాలజీనే చచ్చినట్లు వాడాలి. వాడకం తెలిసిందా సరే సరి, లేదంటే మీ చావు మీరు ఛావాల్సిందే.. వేరే దారి లేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకొస్తే దేశ వ్యాప్తంగా నూటికి 90 శాతం మంది నరకం అనుభవించాల్సిందే. తప్పదు మరి, దేశం కోసం చేసే త్యాగమిది.! నాన్సెన్స్‌, దీన్ని త్యాగమంటారా.? కాదు కాదు, ఇది ప్రభుత్వం పెట్టే టార్చర్‌ మాత్రమే. 

Show comments