బాబు, కేసీఆర్‌లను బీజేపీ నమ్ముతుందా? నమ్మాలా?!

సీట్లను పెంచుతాం.. కానీ మాకు 40 అసెంబ్లీ సీట్లను కేటాయించాలి.. భారతీయ జనతా పార్టీ ఈ షరతును పెడుతోందని అంటున్నారు. ఏపీలో సీట్లను 175నుంచి 225కు పెంచితే పెరిగే యాభై సీట్లు పెరుగుతాయి. ఓవరాల్ గా 40 అసెంబ్లీ సీట్లతో పాటు.. ఎనిమిది లోక్ సభ సీట్లను కూడా అడుగుతోందట భాజపా. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు పోటీ చేసి.. గరిష్టస్థాయి సీట్లలో పోటీ చేయాలని బీజేపీ ఆశించవచ్చు.. ఆ షరతు మీద సీట్లను పెంచడానికి సానుకూలంగా ఉండవచ్చు. 

అయితే ఇక్కడ బీజేపీ గుడ్డిగా ముందుకు వెళుతుందా? అనేదే అత్యంత ఆసక్తికరమైన అంశం. చంద్రబాబు, కేసీఆర్ లు ఇద్దరినీ లైన్లో పెట్టి.. ఆంధ్రాలో ఒకరితో, తెలంగాణలో ఒకరితో పొత్తు పెట్టుకుని.. వీలైనన్ని సీట్లను ఇవ్వాలనే షరతుతో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు బీజేపీ ఓకే చెబుతుంది.. అనేది ఒక ఢిల్లీ లెవల్ నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఈ ఇద్దరు చంద్రులనూ తక్కువ అంచనా వేస్తే అది కమలం పొరపాటే తప్ప మరోటి కాదు.

సీట్లను బీజేపీకి కేటాయిస్తాను అని మొదట్లో హామీని ఇచ్చి.. ఆ తర్వాత బాబు మాట తప్పితే? బాబు మహా మేధావి.. ఎంత మేధావో ఇప్పటికే తెలుగు వాళ్లకు అందరికీ తెలుసు. పొత్తు పెట్టుకుంటాడు. కొన్ని సీట్లను తన మిత్రపక్షానికి ఇస్తాడు.. ఆ తర్వాత మళ్లీ అవే నియోజకవర్గాల్లో తన పార్టీ వాళ్లను పోటీలో పెడతాడు.. తనే స్వయంగా బీఫారాలు ఇచ్చి.. మిత్రపక్షానికి ఇచ్చిన సీట్లలో తన వాళ్లను రంగంలోకి దించుతాడు.

2009లో మహాకూటమికి బాబూ ఇలానే ఝలక్ ఇచ్చాడు, 2014లో భారతీయ జనతా పార్టీకి కేటాయించిన కొన్ని సీట్లలో తెలుగుదేశం అభ్యర్థులు పోటీలో నిలిచారు. మరికొన్ని చోట్ల టీడీపీ రెబల్స్ రంగంలోకి దిగారు. అందరికీ బాబు ఆశీస్సులున్నాయి! ఒక కేసీఆర్ అంటారా.. ఈయన టాలెంటూ ఒక రేంజ్ లో ఉంది. తెలంగాణ ఇస్తే.. తెరాసనే కాంగ్రెస్ లోకి విలీనం అనే హామీని ప్రజల సాక్షిగా ఇచ్చేసి, సోనియాకు కూడా అదే హామీని పడేసి.. చివరకు ఏం చేశాడు?

ఇప్పుడు కాంగ్రెస్ ను తెరాసలో విలీనం చేసుకునే పనిలో ఉన్నాడు. ఇదీ కథ.. వీళ్లను నమ్మి భారతీయ జనతా పార్టీ వీళ్ల రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా సీట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకుంటుందా? తీరా సీట్లు పెంచాకా.. వీళ్లిద్దరూ అడ్డం తిరుగుతారు. అందులో సందేహం లేదు. కేసీఆర్ అయితే.. బీజేపీతో పొత్తుకే ఇష్టపడకపోవచ్చు.

ఎన్నికల తర్వాత చూసుకుందాం.. ఎన్నికల ముందు కాదు.. అని ఒకే మాటతో తేల్చేసే అవకాశాలున్నాయి. ఓవరాల్ గా ఇద్దరు చంద్రులూ కమలం మీద తమ టాలెంట్ ప్రదర్శిస్తున్నారు.. కమలం చేత రాజకీయాన్ని అమల్లో పెట్టేందుకు యత్నిస్తున్నారు.. మరి బీజేపీ ఎంత వరకూ బుట్టలో పడుతుందో వేచి చూడాలి.

Show comments