భూమా సంతాప తీర్మానమా? జగన్ బురద తీర్మానమా?

‘‘కాల్ ది డాగ్ మ్యాడ్.. ఇఫ్ యూవాంట్ టూ కిల్ ఇట్’’ అని ఇంగ్లిషులో ఒక సామెత. ‘నువ్వు కుక్కను చంపదలచుకుంటే గనుక..  ముందుగా అది పిచ్చిది అని ముద్రవేయి’ అనే లౌక్యాన్ని బోధిస్తుంది ఈ సామెత. ఈ సామెత బోధించే మర్మం మన ఏపీలోని తెలుగుదేశం నాయకులకు తెలిసినంత విపులంగా మరెవ్వరికీ తెలియదేమో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించడం, అమరావతి నిర్మించడం, పోలవరం నీటిని అందుబాటులోకి తేవడం ... వీటన్నింటికంటె కూడా.. విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ను సర్వనాశనం చేయడం అనేదే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి పరమాశయం. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో చేతనైనంత మందిని తమ పార్టీలోకి లాక్కున్నారు.  అవకాశం వచ్చిన ప్రతిసారీ వైఎస్సార్ కాంగ్రెస్ మీద దశాబ్దాలు అరిగిపోయిన ఆరోపణల రికార్డులతో, పాచిపోయిన వ్యాఖ్యలతో విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి తెలుగుదేశం వారికి భూమా నాగిరెడ్డి మరణం మరో అద్భుతమైన అవకాశాన్ని అందించినట్లుంది. భూమా నాగిరెడ్డి మరణం నేపథ్యంలో మంగళవారం శాసనసభలో సంతాప తీర్మానం పై చర్చ జరిగింది. ఈ చర్చకు వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. అయితే తెలుగుదేశం తరఫున మాట్లాడిన దాదాపు ప్రతిఒక్క నాయకుడు కూడా భూమా మీద సానుభూతి, సంతాపం వ్యక్తం చేయడం కంటె.. ఈ చర్చకు వైసీపీ రాకపోవడం దారుణం అని, వారి దుర్బుద్ధులకు ఇది ప్రతీక అని.. జగన్ మీద బురద చల్లడానికే ఎక్కువగా ప్రయత్నించారు. 

సహజంగానే సంతాపతీర్మానంపై చర్చ సందర్భంగా తెలుగుదేశం నాయకులే  మాట్లాడారు. ఇక ఒక్కొక్కరూ జగన్ మీద విరుచుకు పడడంలో చెలరేగిపోయారు. జగన్ మనస్తత్వానికి ఇది నిదర్శనం అనీ, తమ పార్టీలో కూడా పనిచేసిన భూమా గురించి సంతాపం వ్యక్తం చేయడానికి వారికి మనసు రాలేదా అని... ప్రతిపక్షం వ్యవహరించిన తీరు సరి కాదని, జగన్ సైకోలాగా వ్యవహరిస్తున్నారని.. ఇలా ఒకటేమిటి... జగన్ మీద బురద చల్లడంలో తెలుగుదేశం నాయకులంతా తమ తమ క్రియేటివిటీని నిండుగా ప్రదర్శించారు. 

భూమా నాగిరెడ్డి మరణం... ఖచ్చితంగా అందరికీ విషాదకరమైన వార్తే. పార్టీలతో నిమిత్తం లేకుండా.. ప్రతిఒక్కరినీ కలచివేసే దుర్వార్త అది. మూడు సంవత్సరాల కిందట శోభా నాగిరెడ్డి హఠాన్మరణం, మూడేళ్లలో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడం... ఆ కుటుంబానికి ఎంతటి శోకమో వర్ణించనక్కర్లేదు. ఆయన మరణం సందర్భంగా తమలోని వేదనను, సానుభూతిని వ్యక్తం చేయడానికి ఎన్ని చెప్పినా తక్కువే. అయితే తెలుగుదేశం నాయకులు దాదాపుగా ప్రతి ఒక్కరూ.. సంతాపంలోని వేదనకంటె ఎక్కువగా జగన్ చర్చకు రాలేదంటూ ఆయన మీద బురద చల్లడానికి చేసిన ప్రయత్నం మాత్రం అసహ్యం పుట్టిస్తోంది. సంతాప తీర్మానానికి వైసీపీ సభ్యులు రాకపోవడం అమానుషమే కావొచ్చు గాక... కానీ పదేపదే దాన్ని ప్రస్తావించి జగన్ ఒక దుర్మార్గుడు, మానవత్వం లేనివాడు అన్నట్లుగా ముద్ర వేయడానికి తెలుగుదేశం నాయకులు అసెంబ్లీ సాక్షిగా పడిన తపన... మరీ అసహ్యకరమైనది. 

Show comments