నిక్కీ గల్రాని దశ తిరిగినట్టేనా.?

కొరియోగ్రాఫర్‌ టర్న్‌డ్‌ డైరెక్టర్‌ లారెన్స్‌ చెయ్యందించకపోయి వుంటే, లక్ష్మీరాయ్‌ కెరీర్‌ ఈపాటికి అటకెక్కేసేదే. ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం లక్ష్మీరాయ్‌, 'కాంచనమాల కేబుల్‌ టీవీ' అనే సినిమాలో హీరో శ్రీకాంత్‌ సరసన నటించింది. ఆ తర్వాత ఆమెని అంతా మర్చిపోయారు. లారెన్స్‌ పుణ్యమా అని 'కాంచన' సినిమాతో లారెన్స్‌, లక్ష్మీరాయ్‌ని లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చాడు. 

తన సినిమాలతో లక్ష్మీరాయ్‌ని పైకి తీసుకురావడం, తన పరిచయాలతో లక్ష్మీరాయ్‌కి అవకాశాలు కల్పించడం.. ఇలా ఆమె కెరీర్‌ ఎదుగుదలకు తనవంతు సహాయం అందిస్తున్నాడు. ఇక, తాజాగా లారెన్స్‌ మరో హీరోయిన్‌ని 'పైకి తీసుకొచ్చే'ందుకు నడుం బిగించాడట. ఆమె ఎవరో కాదు, 'మెట్ట శివ కెట్ట శివ' ఫేం నిక్కీ గల్రానీ. కన్నడ హీరోయిన్‌ సంజన ('బుజ్జిగాడు' ఫేం) సోదరి ఈ నిక్కీ గల్రాని. ఇటీవలే తెలుగులో సునీల్‌తో 'కృష్ణాష్టమి' సినిమాలో నటించింది. తెలుగులో హీరోయిన్‌గా తొలి సినిమాతోనే ఫెయిల్యూర్‌ చవిచూసిందనుకోండి.. అది వేరే విషయం. 

'మెట్ట శివ కెట్టశివ' తర్వాత, నిక్కీ గల్రానితో మరో సినిమా చేసేందుకు లారెన్స్‌ రంగం సిద్ధం చేస్తున్నాడట. తనకు బాగా అచ్చివచ్చిన 'కాంచన' సిరీస్‌లోనే ఇంకో థ్రిల్లర్‌ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాలో నిక్కీ గల్రానితోపాటు, తన లక్కీ లేడీ లక్ష్మీరాయ్‌కి కూడా ఛాన్సిస్తున్నాడట లారెన్స్‌. అన్నట్టు, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో లక్ష్మీరాయ్‌ ఐటమ్‌ సాంగ్‌ చేయడానికి లారెన్స్‌ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

Show comments