వినాయక చవితిని ఇలా జరుపుకుంటారా..!

ఎక్కడ మొదలు పెట్టాం..  ఎక్కడికి వెళుతున్నాం? దేశ సమగ్రతను కాపాడటానికి, హైందవ సంస్కృతిని చాటడానికి, స్వతంత్ర కాంక్షను పెంచడానికి దాదాపు 150 సంవత్సరాల కిందట ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాల్లో ఇప్పుడేం జరుగుతోంది? భారతీయులకు సభలూ సమావేశాలకు అనుమతి లేకపోవడంతో.. మత విశ్వాసం పేరుతో నలుగురిని ఒక చోట కలపడానికి, వారికి స్వతంత్ర పోరాట ఆవశ్యకతను వివరించడానికి.. బాలగంగాధర తిలక్ వంటి పోరాట కర్తల ఆధ్వర్యంలో మొదలైన వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి?

ఈ సంవత్సరమే కాకపోవచ్చు.. పదేళ్ల కిందటో, ఇరవై ఏళ్ల కిందటో.. అంతకన్నా పూర్వమే చవితి పందిళ్ల పరమార్థం మారిపోయి ఉండవచ్చు… పక్కదారి పట్టి ఉండవచ్చు. ప్రస్తుత పందిళ్ల పరిస్థితి చూస్తుంటే బాధ కలగకమానదు. వినాయక చవితిని ఇంట్లో జరుపుకునే పండగలా కాకుండా.. ప్రత్యేకంగా పందిళ్లు వేసి, పదిమంది ఒక చోట కూడా కూడి జరుపుకునే తీరు ప్రతి ఏడాదికీ విస్తృతం అవుతూ పోతోంది. నగరాల్లో, పట్టణాల్లో వీధి వీధికీ ఒక వినాయకుడు. పట్టణాల్లో ఈ హడావుడి చూసి గ్రామాల్లోనూ ఈ సంస్కృతిని అందిపుచ్చుకున్నారు.

వినాయకుడి పేరు చెబితే చందాలకు లోటే లేదు. చిన్న చిన్న పట్టణాల్లో కూడళ్లలో విగ్రహాలు పెట్టే వాళ్లు తక్కువలో తక్కువగా నాలుగైదు లక్షల రూపాయలు వసూళు చేయగలుగుతున్నారు. ఆ పట్టణాల్లో అలాంటి కూడళ్లు చాలానే ఉంటాయి. వసూలు చేయడం బాగానే ఉంది, ఈ ఉత్సాహమూ బాగానే ఉంది. తీరా ఆ పందిళ్లలో జరుగుతున్నది ఏమిటి?

నిజంగానే భక్తితోనూ.. విశ్వాసంతోనూ.. పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారా? అంటే.. భక్తీ లేదు , విశ్వాసమూ లేదు అని చెప్పక తప్పదు. ఎక్కడో అపార్ట్ మెంట్ కాంపౌండ్లలో సంసార పక్షంగా ఏర్పాటు చేసుకునే వారు, కుటుంబాలు కుటుంబాలే కూర్చుని  వినాయకుడిని పూజించే పందిళ్ల ను పక్కన పెడితే..  మిగతా చోట్ల “వినాయకుడు’’ కేవలం ఒక సాకు మాత్రమే!

అక్కడ జరిగేవన్నీ అసాంఘిక కార్యకలాపాల్లాంటివే! భక్తి ని పక్కన పెట్టి సినిమా బూతు సాహిత్యాన్ని లౌడ్ స్పీకర్లతో ప్లే చేయడంతో మొదలుపెడితే, అర్ధనగ్న నృత్యాల వరకూ.. ఒక్కో ఏరియాలో ఒక్కో స్థాయిలో జరుగుతున్నాయి ఈ “ఉత్సవాలు’’. రాజకీయ నేతలు, లోకల్ రౌడీల ఇన్ వాల్వ్ మెంట్ తో సాగే ఈ కార్యక్రమాల్లో.. ఒక్కో రోజు ఒక్కో స్పెషల్. ఈ పందిళ్లలో కనీసం ప్రసాదాలు అయినా ఉంటాయో ఉండవో కానీ.. మద్యం, మాంసం తో యువత విందులకు కొదవలేదు. 
ఈ తరహా ఎంజాయ్ మెంట్ కోసమే వినాయక ఉత్సవాలు అంటే తెగ ఉత్సాహభరితులవుతున్నారు కొంతమంది జనాలు. ఈ కార్యక్రమాల్లో రాజకీయ నేతలు, రౌడీలు పాల్గొని చిందులేయడం.. వినాయకుడి విగ్రహం ముందే ఆడవాళ్లను అర్ధనగ్నంగా మార్చి.. తాగి తందనాలు ఆడటం.. చాలా కామన్ అయిపోయింది. కొంతమంది ఇలాంటి అరణ్యకాండలకు సంబంధించిన వీడియోలను తీసి.. ఇంటర్నెట్ లోకి అప్ లోడ్ చేస్తున్నారు. 

మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ.. తెలంగాణ, ఆంధ్రాల్లో ప్రథమగణాధిపతి పూజలు ఈ విధంగా సాగుతున్నాయి. సగానికి సగం పందిళ్లు.. మందు, విందుకే  వేదికలు అవుతున్నాయి. తాగితే తప్ప ఉత్సాహం రావడం లేదో లేక ఉత్సాహంలో తాగకతప్పదో కానీ.. ఇలా సాగుతోంది ఈ నయా తరం భక్తి! వీటిని చూస్తూ ఆ వినాయకుడు ఎలా భరిస్తున్నాడో పాపం!

Show comments