అశోక్‌ సైలెన్స్‌.. సుజనా ఓవరాక్షన్‌.!

కేంద్రంలో ఏం జరుగుతోందో టీడీపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుకి తెలుసు. గట్టిగా మాట్లాడినా ఉపయోగముండదనే విషయం ఆయనకు ఎప్పుడో అర్థమయిపోయింది. ఏమీ చెయ్యలేనప్పుడు, మౌనంగా వుండడమే మేలన్న నిర్ణయానికి ఆయన ఎప్పుడో వచ్చేశారు. అందుకే, సైలెంట్‌గా వుంటున్నారాయన. 

సుజనా చౌదరి అలా కాదు, ఏవేవో మాట్లాడేస్తుంటారు. కాస్త పబ్లిసిటీ యావ ఎక్కువ ఈయనకి. పైగా వివాదాలతో నిత్యం సావాసం చేస్తుంటారు. తనకు పార్టీలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా శతృవుల్లేరని చెప్పుకోవడం సుజనా చౌదరికే చెల్లుతుంది. ప్రత్యేక హోదా అంశం విషయంలో కాస్తంత ఎక్కువగా హడావిడి చేస్తున్నది సుజనా చౌదరి మాత్రమే. గడచిన రెండేళ్ళలో ఆయన ప్రత్యేక హోదా గురించి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే, ఆయన అవగాహనా రాహిత్యమేంటో అర్థమవుతుంది. అంతేనా, ఆయన పబ్లిసిటీ కోసం ఎంత పాకులడుతున్నారో స్పష్టమయిపోతుంది. 

వాస్తవానికి సుజనా చౌదరి సహాయ మంత్రి మాత్రమే. అశోక్‌గజపతిరాజు అలా కాదు, ఆయన క్యాబినెట్‌ మంత్రి. 'పవర్‌' పరంగా సుజనా కన్నా, అశోక్‌ గజపతిరాజుదే పై చేయి. అయినా, పరిస్థితులకు అనుగుణంగా ఆయన కామప్‌ అయిపోయారు. పైగా, అశోక్‌ గజపతిరాజు ఎంత కాదన్నా ప్రజా బలంతో రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి. సుజనా చౌదరి, ఆర్థిక బలం కారణంగా రాజ్యసభ టిక్కెట్‌ పొంది, చంద్రదబాబుకి అత్యంత సన్నిహితుడు, పార్టీకి కావాల్సినవాడు.. అనే కేటగిరీలో కేంద్ర మంత్రి పదవి సంపాదించుకున్న వ్యక్తి. 

ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా వుందండోయ్‌. సుజనా చౌదరికి 'మీడియేటింగ్‌'లో విపరీతమైన అనుభవం వుందట. ఆ కారణంగానే, కేంద్రమంత్రిగా ఆయనకు పదవి ఇచ్చిన చంధ్రబాబు, కేంద్రంతో తనకు కావాల్సిన పనులు చక్కబెట్టుకుంటున్నారు. అలా, సుజనా చౌదరికి అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కుతోంది. 

మిగతా విషయాల్లో ఎలా వున్నా, ఈ మధ్యకాలంలో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి సుజనా చౌదరి ఓవరాక్షన్‌ హద్దులు దాటుతోంది. 'మెడికల్‌ సీటు - ఇంజనీరింగ్‌ సీటు' అంటూ ఆయన చెబుతున్న అర్థం పర్థం లేని లాజిక్‌లు టీడీపీ నేతలకే ఒళ్ళు మండేలా చేస్తున్నాయి. కేంద్ర క్యాబినెట్‌ మంత్రి అయి వుండీ అశోక్‌ గజపతిరాజు గమ్మున వుంటోంటే, సుజనా ఓవరాక్షనేంటని టీడీపీ నేతలే ఆఫ్‌ ది రికార్డ్‌గా మండిపడుతున్నారట. 

మొన్నామధ్య, టీడీపీ నేత బొండా ఉమ, విజయవాడలో బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే, సుజనా పిలిచి క్లాస్‌ పీకడం.. బొండా తన గోడుని చంద్రబాబు వద్ద వెల్లగక్కినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో, కేవీపీ ప్రైవేటు బిల్లు లోక్‌సభకు రిఫర్‌ చేసిన సందర్భంలో, సుజనా బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేయడం వివాదాస్పదమయ్యింది. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నుంచి పదే పదే మొట్టికాయలు పడుతున్నా సుజనా చౌదరి తీరు మారడంలేదు. 

Show comments