పార్లమెంటుని నమ్మేదెలా.?

పార్లమెంటు ద్వారా జరిగిన చట్టాలకు తప్ప, పార్లమెంటు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాలకు, పార్టీలకు సంబంధం వుండదంతే. ఇదే 'దేవాలయ' సిద్ధాంతం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయింది, పార్లమెంటు చేసిన చట్టంతోనే. అదే పార్లమెంటులో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన ప్రకటనకు విలువ లేదు. అలాంటప్పుడు రాజకీయ పార్టీలు పార్లమెంటులో ప్రభుత్వం నుంచి ప్రకటన ఎందుకు ఆశిస్తాయి.? 

పొద్దున్నే పార్లమెంటుకు వెళ్ళడం, అక్కడ గలాటా సృష్టించడం.. తిరిగి రావడం.. ఇదే చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులు చేసే పని అన్నట్టుగా వుంది వ్యవహారం. విపక్ష సభ్యులు విమర్శించాలి, అధికార పక్ష సభ్యులు ఎదురుదాడికి దిగాలి. ఇద్దరూ కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించే నిర్ణయాలు తీసుకోవాలి. ఇదేనా, పార్లమెంటరీ వ్యవస్థ అంటే.? ఏమో, ప్రజలకు అవే సంకేతాలు వెళుతున్నాయిప్పుడు. 

ఉమ్మడి తెలుగు రాష్ట్ర విభజన ప్రక్రియ ఎంత గొప్పగా జరిగిందో ప్రపంచమంతా చూసింది. ఆ చట్టం జరిగిన సభ.. పైగా పెద్దల సభ ద్వారా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే, 'అదో చెత్త సభ..' అన్నట్లుగా అక్కడ జరిగిన వ్యవహారాలతో తమకు సంబంధం లేదని తేల్చేసింది ప్రస్తుత నరేంద్రమోడీ ప్రభుత్వం. నిజం నిష్టూరంలానే వుంటుంది.. నిజాలు ఇంత ఘాటుగానే వుంటాయి మరి.! 

ఇప్పుడిదంతా ఎందుకంటే, పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం టీడీపీ, వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన చేస్తోంటే, 'ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తారు.. సంయమనం పాటించాలి.. కసరత్తు చేస్తున్నాం..' అంటూ ప్రభుత్వం తరఫున ఓ ప్రకటన వచ్చింది. ఈ దెబ్బతో సభలో ఆందోళన చేపట్టిన ఏపీ ఎంపీలు సైలెంటయిపోవాలట కామెడీగా.! 

ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీకే దిక్కు లేదు. ఆర్థిక మంత్రి హోదాలో అరుణ్‌ జైట్లీ ప్రకటన ఇస్తే దానికి విలువ వుంటుందా.? పార్లమెంటు సాక్షిగా ఆయన లిఖిత పూర్వక హామీ ఇచ్చినా, దాన్ని ఎంచక్కా చెత్తబుట్టలో పడేయొచ్చు. దానికి ఉమ్మడి తెలుగు రాష్ట్ర విభజన ప్రక్రియే నిదర్శనం. ప్రత్యేక హోదాపై చట్టం చేస్తాం.. ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాల్సిన నిధులపై చట్టం చేస్తాం.. అని చెబితే తప్ప, సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చినా నమ్మే పరిస్థితుల్లో దేశ ప్రజానీకం లేరు. 

చట్ట సభల గౌరవాన్ని ఇంత అధమ స్థాయికి తొక్కేసిన ఘనత ద గ్రేట్‌ నరేంద్రమోడీగారికే చెల్లుతుంది. ఈ మాత్రందానికి, పార్లమెంటలోకి అడుగు పెడుతూ 'దేవాలయం..' అంటూ కహానీలు ఎందుకు చెప్పారో మరి నరేంద్రమోడీ.! బలిచ్చేముందు మేకకి కూడా డెకరేషన్లు చేస్తారు.. దణ్ణాలు పెడతారు.. అలాగే చట్ట సభల స్థాయిని దిగజార్చేముందు, చట్ట సభలకు నమస్కారం చేశారనుకోవాలేమో.!

Show comments