వాళ్ళెందుకు చచ్చిపోతున్నారు.?

సరిహద్దుల్లో సైన్యం సరదాగా ఎంజాయ్‌ చెయ్యట్లేదు. తుపాకీలు చేతపట్టి ప్రాణాలకు తెగించి శతృవుతో పోరాడుతోంది భారత సైన్యం. ఆ శతృవు ఎవరో కాదు, పాకిస్తాన్. '124 కోట్లమంది భారతీయుల్లో మేమే ఎందుకు తుపాకీ పట్టుకోవాలి.?' అన్న ఆలోచన ఆ 'సైన్యానికి' ఎప్పుడూ రాలేదు. 'మేం ఇక్కడ వుండబట్టే.. దేశం ప్రశాంతంగా వుంది..' అన్న భావనతో సైన్యం, సరిహద్దుల్లో ప్రాణాల్ని పణంగా పెట్టింది. 

ఇంతకీ, సరిహద్దుల్లో సైన్యం ఎవరితో పోరాడుతోంది.? పాకిస్తాన్‌తోనా.? కాదా.? అబ్బే, అదేమీ కాదు.. పాకిస్తాన్‌ సైనికుల చేతుల్లోని తుపాకులు మాత్రమే పేలుతున్నాయి.. ఆ పాకిస్తాన్‌ పెంచి పోషించిన తీవ్రవాదుల చేతుల్లోని తుపాకులు మాత్రమే మన సైనికుల ప్రాణాల్ని తోడేస్తున్నాయి. పాకిస్తాన్‌కి అస్సలు ఈ యుద్ధంతో సంబంధం లేదు. మన దేశంలో బాంబులు పేలుతున్నాయంటే.. దానిక్కారణం పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదులూ కాదు, పాకిస్తాన్‌ అసలే కాదు.. ఆ బాంబులే అలా పేలిపోతున్నాయ్‌.! 

సిగ్గు సిగ్గు.. ఓ అమరవీరుడి కుమార్తె, తన తండ్రి మరణానికి పాకిస్తాన్‌ కారణం కాదని చెప్పడమంటే, ఆ అమరవీరుడి ఆత్మకి శాంతి చేకూరేదెలా.? 'నేను ఏబీవీపీ వ్యతిరేకిని..' అనే ప్లకార్డ్‌తో సోషల్‌ మీడియాలో పాపులారిటీ పెంచుకున్న గుర్‌మెహర్‌ కౌర్‌, 'మా నాన్నని చంపింది పాకిస్తాన్‌ కాదు..' అనే ప్లకార్డ్‌తో ఇప్పుడు వివాదాల్లోకెక్కింది. క్రికెటర్‌ సెహ్వాగ్‌, సోషల్‌ మీడియాలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ, 'నేను ట్రిపుల్‌ సెంచరీ చేయలేదు.. నా బ్యాట్‌ చేసింది..' అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. 

ఆ మధ్య, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, 'నేను ముంబైలో ప్రజల్ని చంపలేదు.. బాంబులే ప్రజల్ని చంపాయి..' అనడాన్ని ఇంకొందరు ప్రస్తావిస్తూ, దావూద్‌ ఇబ్రహీంతో గుర్‌మెహర్‌కౌర్‌ని పోల్చుతున్నారు. 

విద్యార్థి రాజకీయాలు వేరు, దేశ ప్రయోజనాలు వేరు. భారత ప్రధాని పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాల్ని కోరుకోవడాన్ని ఎలా తప్పుపట్టగలం.? దేశాల స్థాయిలో చర్చలు జరగాలి.. అదే సమయంలో, దేశ సరిహద్దుల్లో సైన్యం, దేశ భధ్రత కోసం పనిచెయ్యాలి. దేశంలో దాదాపు అన్ని ప్రముఖ నగరాలూ ఏదో ఒక సందర్భంలో తీవ్రవాదుల దాడులకు గురైనవే. ఆ తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నదెవరు.? పాకిస్తాన్‌ కాదా.! 

విద్యార్థి లోకంలో తయారైన ఈ కొత్తతరం 'మేథావుల' పుణ్యమా అని, దేశం భ్రష్టుపట్టిపోయే పరిస్థితులు దాపురించాయి. పాకిస్తాన్‌ విషయంలో రాజకీయ పార్టీలే ఆచి తూచి స్పందిస్తున్నప్పుడు, విద్యార్థి లోకం ఇంకెంత జాగ్రత్తగా స్పందించాలి.? అందునా, అమరవీరుడి కుమార్తె అయివుండీ.. గుర్‌మెహర్‌ కౌర్‌ ఇంకెంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.? గుర్‌మెహర్‌ దేశాన్ని మాత్రమే అవమానించలేదు, తన తండ్రిని కూడా అవమానించిందిక్కడ.

Show comments