బ్లాక్ మనీలో.. నోట్ల వాటా మరీ ఇంత తక్కువా!

మోడీకి ఆ మాత్రం తెలీకుండానే.. మారకంలో ఉన్న ఐదువందల, వెయ్యి రూపాయల నోట్లను వెనక్కు తీసుకోవడానికి నిర్ణయించి ఉంటాడా? ఎంతో మంది ఆర్థిక వేత్తల, హార్వర్డ్ ఎకనమిస్టుల సలహాలు లేకుండానే ఈ పని చేసి ఉంటాడా? అని కొంతమంది ఈ నోట్లు వెనక్కు తీసుకునే ప్రక్రియను గట్టిగా సమర్థిస్తున్నారు కానీ.. ఆదాయ పన్ను శాఖ అధికారిక గణాంకాలు పరిగణనలోకి తీసుకుంటే.. సామాన్యుడికి కూడా ఈ నిర్ణయం పట్ల ఆశ్చర్యం మాత్రమే కలుగుతుంది. ఈ మాత్రం దానికి ఇంత హడావుడా? అనే అభిప్రాయం కలుగుతుంది!

ఫైనాన్షియల్ ఇయర్ 2012-13 కు సంబంధించి.. బయటపడ్డ అక్రమాస్తులు, అవినీతి కేసుల వ్యవహారాల్లో.. సదరు నల్లధనికుల దగ్గర ఎంత మేరకు క్యాష్ రూపంలో సంపద లభ్యమైంది.. అనే విషయాన్ని పరిశీలిస్తే.. దాని శాతం 5 మాత్రమే! అంటే.. వంద రూపాయల విలువ జేసే నల్లధనంలో ఐదు రూపాయలు క్యాష్ రూపంలో లభ్యం అయ్యింది. ఈ విషయాన్ని ఆదాయ పన్ను శాఖ రైడింగ్స్ గణాంకాలు తెలుపుతున్నాయి!

నల్లధనికులు, అక్రమాస్తులు కలిగిన వాళ్లు తమ దగ్గర ఉన్న సంపదలో 95 శాతం  వాటాను స్టాక్స్, బంగారం, ఇళ్లు, ఫ్లాట్లు, వజ్రాలు.. తదితరాల మీద పెట్టారు. అలాగే విదేశీ కరెన్సీ. కేవలం ఐదు శాతం డబ్బును మాత్రమే క్యాష్ రూపంలో ఉంచుకున్నారట  నల్లధనికులు! ఏదేదో ఒకటీ రెండు కేసుల డాటా ప్రకారం కాదు.. ఒక ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన అన్ని ఇన్ కమ్ టాక్స్ రైడింగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.

ఆ ఒక్క ఏడాదే కాదు.. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైడింగ్స్ డాటాను విశ్లేషిస్తే… నల్లధనికుల దగ్గరదొరికిన బ్లాక్ కరెన్సీ ఆరు శాతం! 94 శాతం నల్లధనాన్ని ఇతర రూపాల్లోనే గుర్తించారు.  

ఇక్కడ ఇంకో లెక్క కూడా ఉంది. అదే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ఒకటి నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకూ జరిగిన అన్ని రైడింగ్స్ లోనూ కలిపి దేశ వ్యాప్తంగా రూ.7,700 అక్రమాస్తులను గుర్తించారు. ఇందులో ఐదువందలు, వెయ్యి నోట్ల రూపంలో పట్టుబడ్డ మొత్తం రూ.448 కోట్ల రూపాయలు.  ఓవరాల్ గా ఏడాదికి తీసుకుంటే.. నల్లధనికుల వద్ద క్యాష్ రూపంలో బయటపడే మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ రూ. వెయ్యి కోట్లకు మించదు!

ఇదీ ఎవరో కల్పించి చెబుతున్న పరిస్థితి కాదు.. ఆదాయ పన్నుశాఖ గణాంకాలు విశ్లేషిస్తున్న విషయాలు ఇవి. ఈ నోట్ల మార్పిడి వ్యవహారంతో నల్లధనికుల పని మటాష్ అనుకోవడం కేవలం భ్రమ. తమ సంపదలోఐదారు శాతాన్ని మించని ఈ నోట్ల ను మార్పించుకోవడానికి వచ్చి వాళ్లు ఇరుక్కొంటారు అనుకోవడానికి మించిన అమాయకత్వమూ ఉండకపోవచ్చు. కాబట్టి.. ఈ నోట్లను వెనక్కు తీసుకోవడం అనేది నల్లధనంపై మోడీ కొట్టిన మాస్టర్ స్ట్రోక్ అనేది శుద్ధ అబద్ధం.

ఇక దొంగ నోట్లు.. అవి బయటపడతాయి అని ఆశించవచ్చు. ఈ విషయంలో బాధితులు అమాయక ప్రజలు మాత్రమే! మరి ప్రస్తుతానికి ఇదీ పరిస్థితి. ఈ నోట్ల మార్పిడి వ్యవహారం ధీర్ఘకాలిక పరిస్థితులు ఎలా ఉంటాయనేదానికి కాలమే సమాధానం ఇవ్వాలి.   

Show comments