మన దేశంలో కులాలకు, రాజకీయాలకు ఉన్న అవినాభావ సంబంధం తెలిసిందే. కులరహిత సమాజం రావాలని, సమసమాజం నిర్మించాలని పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కులం పేరు చెప్పుకోకుండా రాజకీయాలు చేయలేరు. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే కులం గురించి మాట్లాడకపోతే సామాన్యులు సమాజంలో బతకడం కూడా కష్టమే. ఏ సంక్షేమ పథకాలైనా కులం ఆధారంగా అమలు చేస్తున్నారేగాని ఆర్థిక పరిస్థితి ప్రాతిపదికన కాదు కదా. వనరుల దోపిడీ, ఉద్యోగాల్లో అన్యాయం, నీళ్ల మళ్లింపు....వగైరా అనేక కారణాలను బేస్ చేసుకొని చెలరేగిన ఉద్యమంతో రాష్ట్రం విడిపోయింది. కాని రెండు రాష్ట్రాల నాయకుల మధ్య కులాభిమానం పోలేదు.
ఆంధ్రలోని కుల సంఘాలకు తెలంగాణ నాయకులు మద్దతు ఇస్తున్నారు. అలాగే తెలంగాణలోని కుల సంఘాలకు ఆంధ్రా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ వివిధ కులాలకు సామాజిక హోదా విషయంలో వైరుధ్యాలున్నప్పటికీ సంఘీభావం కొనసాగుతోంది. తెలంగాణలో రిజర్వుడు కేటగిరీలో ఉన్న కొన్ని కులాలు ఆంధ్రాలో అగ్రవర్ణాల కింద లెక్క. అయినప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ నాయకులు ఒకే కులంగా భావిస్తారు. ఆంధ్రాలో కాపులు తెలంగాణలో మున్నూరు కాపులు. కాపులు అగ్రవర్ణాలు. మున్నూరు కాపులు రిజర్వుడు (బీసీ) కేటగిరీ. ఆంధ్రాలో రిజర్వేషన్ల కోసం కాపులు చేస్తున్న ఆందోళనకు మున్నూరు కాపులు మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా ఆ కులం రాజకీయ నాయకులు.
తాజాగా తిరుమలకు దైవదర్శనానికి వెళ్లిన తెలంగాణ కాంగ్రెసు నాయకుడు వి.హనుమంతరావు అలియాస్ వీహెచ్ తన కులాభిమానం వెల్లడించుకున్నారు. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వీహెచ్ ఆంధ్రాలో కాపుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రంలో కాపుల రాజ్యం రావాలనేది తన ఆకాంక్షగా చెప్పారు. ఏపీలో కాపులే నాయకత్వం వహిస్తారని జోస్యం చెప్పారు. కాపులు అధికారంలోకొస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కులాభిమానం ఉండటం తప్పు కాదు. అధికారంలోకి రావాలనుకోవడం తప్పు కాదు. అయితే వీహెచ్ ఏ కాపు నాయకుడు అధికారంలోకి వస్తే మంచిదో కూడా చెప్పేశారు. అందుకు ప్రాతిపదిక ఏమిటో తెలియదు. ఆయన మనసులో ఉన్న వ్యక్తి పవర్‌స్టార్ కమ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
రాష్ట్రానికి ఆయన నాయకత్వం వహిస్తే (అధికారం చేపట్టడమనే అర్థం) కులమతాలకు అతీతంగా అందరికీ మేలు కలుగుతుందన్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓసారి కాపు నాయకులంతా కలిసి సమావేశం నిర్వహించారు. అందులో చిరంజీవి కూడా పాల్గొన్నారు. అందులో ప్రసంగించిన వీహెచ్ కాపులకు రాజ్యాధికారం దక్కడంలేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాపు సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టే ముఖ్యమంత్రిని కాలేకపోయానన్నారు. రెడ్లు, కమ్మ సామాజికవర్గాల ఆధిపత్యం కారణంగా కాపులకు అధికారం దక్కడం లేదన్నారు.
ఆంధ్రాలో కాపుల రాజ్యం వస్తుందో రాదో చెప్పలేంగాని ముద్రగడ పద్మనాభం 'మరోసారి విజృంభిస్తా' అని చంద్రబాబుకు హెచ్చరికలు పంపారు. ఆయన ప్రతిరోజు కేలండర్ చూసుకుంటున్నారు. కాపు రిజర్వేషన్ కోసం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో (ఆగస్టు) ముగుస్తుందని, మంత్రివర్గ ఉపసంఘం గడువు వచ్చే నెల (సెప్టెంబరు) 7వ తేదీతో ముగుస్తుందని గుర్తు చేశారు.
మరి ముద్రగడ మొదటి గడువు ముగిశాక రోడ్డెక్కుతారా? రెండో గడువు అయిపోయాక తనదైన శైలిలో నిరాహార దీక్ష చేస్తారా? చూడాలి. రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుండగా ముద్రగడ ఇప్పటివరకు దాన్నిగురించి ఎప్పుడూ ఆలోచించనట్లుంది. కాపులకు రిజర్వేషన్లు సాధించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆయన కోరిక. అదే ఆయన ఏకైక అజెండా. ముద్రగడ రోడ్డెక్కితే మళ్లీ ఎలాంటి సంచలనం కలుగుతుందో...!