మోదీకి మద్దతుదారు...బీజేపీకి ప్రత్యర్థి...!

సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల హడావుడి ప్రారంభమైనట్లుగా కనబడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో అధికార-ప్రతిపక్షాల మధ్య యుద్ధమే జరుగుతోంది. విమర్శలు-ప్రతి విమర్శలు జోరుగా సాగుతున్నాయి. సవాళ్లు-ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. దమ్ముంటే ఇప్పటికిప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని హూంకరిస్తున్నారు. ఘీంకరిస్తున్నారు.

తెలంగాణకు కేంద్ర సాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌-బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మధ్య జరిగిన మాటల యుద్ధం, సవాళ్లు-ప్రతి సవాళ్ల పర్వం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. అమిత్‌ షా రావడంతో కేసీఆర్‌ భయపడ్డారని కమలం నాయకులు చెప్పుకుంటే, కేసీఆర్‌ను చూసి అమిత్‌ షా గడగడ వణికిపోయారని టీఆర్‌ఎస్‌ నేతలు ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఏమిటది? 

కేసీఆర్‌-అమిత్‌ షా మాటల యుద్ధం ముగిశాక కూడా ఈ ఎపిసోడ్‌ ముగియలేదు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ఒకరినొకరు ఇంకా విమర్శించుకుంటూనే ఉన్నారు. ఈ విమర్శల మధ్యనే 'రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తాం' అని సీఎం కేసీఆర్‌ మరోసారి తెలియచేశారు. అమిత్‌ షా తెలంగాణను అవమానించారని ఆగ్రహించిన కేసీఆర్‌ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తన మద్దతు పునరుద్ఘాటించడం విచిత్రమే. ఈ మద్దతు ఎవరి మొహం చూసి ఇస్తున్నట్లు? ప్రధాని నరేంద్ర మోదీ మొహం చూసి ఇస్తున్నారు. తాను మోదీ సర్కారుకు వ్యూహాత్మక మిత్రుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ అమిత్‌ షా విమర్శలు చేయడమేంటని కేసీఆర్‌ ఆగ్రహించారు. అయినప్పటికీ వ్యూహాత్మక మిత్రత్వాన్ని కొనసాగిస్తున్నారు.

మోదీకి మద్దతుదారుగా ఉన్న కేసీఆర్‌ అదే సమయంలో బీజేపీకి ప్రత్యర్థిగా మారిపోయారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎన్‌డీఎఏకు కేసీఆర్‌ మద్దతు పలికినప్పటికీ ఆ విషయంలో పార్టీగా బీజేపీ కృతజ్ఞతతో లేదనే చెప్పుకోవాలి. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాగాని, తెలంగాణ బీజేపీ నాయకులుగాని ఆయన మద్దతు విషయానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. మద్దతు ఇస్తే ఎంత? ఇవ్వకపోతే ఎంత? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాదిరిగానే కేసీఆర్‌ కూడా వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయే (ఎన్‌డీఏ) అధికారంలోకి వస్తుందని, మోదీయే ప్రధాని అవుతారని నమ్మకం ఉన్నట్లుంది. తెలంగాణకు మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతానని ఆయనకు పూర్తి విశ్వాసం ఉంది. అంటే వచ్చే ఎన్నికల్లోనూ మోదీ ప్రధాని, కేసీఆర్‌ సీఎం అవుతారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్‌డీఎకు మద్దతు ఇవ్వడమే మంచిదనుకుంటున్నారేమో...! 

ఒకవేళ మద్దతు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల తరువాత ఏర్పడే టీఆర్‌ఎస్‌ సర్కారును మోదీ ఇబ్బంది పెడతారనే భావన ఉండొచ్చు. అందే బీజేపీ తనను భయంకరమైన విలన్‌గా చిత్రీకరిస్తున్నా మద్దతును పునరుద్ఘాటించారు. బీజేపీ కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌లపై మొదటినుంచి విమర్శలు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం కేంద్రానికి సానుకూలంగానే ఉన్నారు. నోట్ల రద్దు చర్యకు మద్దతు ఇవ్వడానికి బీజేపీ ముఖ్యమంత్రులే జంకిన సమయంలో ఈ చర్యను మొట్టమొదటగా తాను సమర్ధించానని కేసీఆర్‌ చెప్పుకున్నారు. మోదీ పిలుపు మేరకు నగదు రహిత లావీదేవీలను ప్రోత్సహించానని చెప్పారు. వివిధ సందర్భాల్లో కేసీఆర్‌తో మోదీ సన్నిహితంగా మాట్లాడి ఆయన సూచనలు, సలహాలు తీసుకున్నారు. 

అధికారానికి వచ్చిన కొత్తలో మోదీపై దూకుడుగా వ్యవహరించిన కేసీఆర్‌ క్రమంగా సానుకూలంగా ఉండటం ప్రారంభించారు. గతంలో అమిత్‌ షా సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలున్నాయి. గతంలో  ఒకసారి అమిత్‌ షా హైదరాబాదుకు వచ్చినప్పడు 'టీఆర్‌ఎస్‌తో పొత్తుకు మేం సిద్ధం' అని  ప్రకటించారు. కాని ఇప్పుడు కేసీఆర్‌ను భయంకరమైన వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ దూకుడును ప్రధాని మోదీ గమనించకపోరు. ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలన్న, అధికార పార్టీతో పొత్తుకు ప్రయత్నించాలన్నా (అదే జరిగితే కేసీఆర్‌ ఒప్పుకోరనుకోండి) మోదీ ఆమోదం లేనిదే జరగదు. ఏది ఏమైనా తెలంగాణలో అధికార పార్టీ-ప్రతిపక్షాల మధ్య పోరు అప్పుడే ప్రారంభమై రంజుగా సాగుతోంది.

Show comments