కాంగ్రెస్ దరిద్రం.. కమలానికి పడుతోంది!

నైతిక విలువలకు, వ్యక్తిగత విలువల ప్రవచనాలకు తమ పార్టీ పుట్టినిల్లు లాంటిది అని భారతీయ జనతా పార్టీ చాలా గర్వంగా చెప్పుకుంటుంది. ఈ పార్టీ పుట్టినిల్లు ఆర్ఎస్ఎస్ వాళ్లను కదిలించినా, దాని అనుబంధ సంఘాల వాళ్లను కదిలించినా.. విలువల హననాన్ని ఏ మాత్రం తట్టుకోలేరు! పబ్బులపై దాడులు చేస్తారు, న్యూ ఇయర్ వేడుకలు వద్దంటారు, ఆడవాళ్లు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెబుతారు.. వేలంటైన్స్ డే సంస్కృతి నశించాలంటారు, ఎవరూ ఎవరినీ ప్రేమించకూడదని కూడా చెప్పేస్తారు! మరి ఇలా చెప్పే వాళ్లు తాము వ్యక్తిగతంగా ఎలా వ్యవహరిస్తారో జగమెరిగినదే కానీ.. భారతీయ జనతా పార్టీ రాజకీయాలు ‘విలువల’ విషయంలో ఏ స్థాయిలో దిగజారుతోందో కూడా ఇప్పుడు స్పష్టం అవుతోంది. 

ఇప్పటికే ఫిరాయింపు రాజకీయాలు చేస్తూ, వాటికే వత్తాసు పలుకుతూ, అవకాశ వాద రాజకీయాలు చేస్తూ, బ్యాంకులకు లోన్లను ఎగ్గొట్టిన వాళ్లకు మంత్రి వర్గంలో స్థానమిచ్చి.. రాజకీయ అవినీతిలోనూ లోటేమీ లేకుండా సాగుతున్న కాషాయ పార్టీ ఇప్పుడు కళంకితులకు కూడా ఎంచక్కా పార్టీలో స్థానం ఇస్తోంది!

నారాయణ్ దత్ తివారీని పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ తన పతనావస్థను ప్రపంచానికి తెలియజేసింది. ఏం తివారీని చేర్చుకుంటే తప్పా? అని వీర బీజేపీ భక్తులు, అపర హిందుత్వవాదులు, మోడీ భక్తగణం ప్రశ్నించవచ్చు గాక! తివారీని చేర్చుకోవడం వరకూ దిగజారిన వారు..  అది తప్పా? అని ప్రశ్నించడం పెద్ద దిగజారుడు తనం గాకపోవచ్చు. ఇంకో పది మెట్లు కిందకు జారడం అంతే!

సురేష్ కల్మాడీకి పదవులు ఇస్తారు, తివారీకి పార్టీ సభ్యత్వం ఇస్తారు, మాల్యా ఎగిరిపోవడానికి సహకారం ఇస్తారు, నచ్చని వాళ్ల వైపుకు సీబీఐని- ఐటీని ఉస్కో అంటారు.. మొత్తానికి బీజేపీపై ఎన్ని భ్రమలు ఉండినాయో అన్నీ వదిలిపోయేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం ఉంది.. అప్పటికంతా కమలం పార్టీ నగ్న రూపం ప్రజల ముందు పూర్తిగా ఆవిష్కృతం అవుతుందిలే! అదేమంటే.. కాంగ్రెస్ చేయలేదా? కాంగ్రెస్ హయాంలో జరగలేదా? మీకు కాంగ్రెస్సే రైటు అంటూ శాపనార్థాలు  పెడతారు. అయినా ఏ రాయి అయితేనేం.. పళ్లూడగొట్టుకోవడానికి! 

Show comments