రాములమ్మ వలస ఖాయమేనా?

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు సంభవించినప్పడల్లా తెలంగాణ కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి అలియాస్‌ రాములమ్మ పేరు వినిపించడం ఈమధ్య కాలంలో ఎక్కువైంది. ప్రస్తుతం అన్నాడీఎంకేలో అనూహ్య పరిణామాలు సంభవిస్తుండటంతో విజయశాంతి పేరు మీడియాలో మరోసారి ప్రచారంలోకి వచ్చిం ది. తీగ లాగితే డొంక కదలినట్లుగా తమిళనాడులోని అన్నాడీఎంకేలో ఏం జరిగినా తెలంగాణలోని విజయ శాంతి స్పందించడం స్పష్టంగా కనబడుతోంది.

తెలంగాణకు తమిళనాడుతో భౌగోళిక సంబంధాలు, సరిహద్దులు లేవు. రాజకీయ సంబంధాలూ లేవు. కాని 'నేను తెలంగాణ బిడ్డను' అని గుండెలు బాదుకున్న విజయ శాంతి తన చూపు తమిళనాడుపై సారించింది. ఆమె తమిళ రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని అనుకుంటోందని, అన్నాడీఎంలో (శశకళ వర్గం) చేరి కీలక పాత్ర పోషించాలని ప్రయత్నాలు చేస్తోందని కొంతకాలంగా మీడియాలో జోరుగా వార్తలొస్తున్నాయి. ఆ వార్తలు కేవ లం ఊహాగానాలు కావని చెప్పడానికి విజయశాంతి వ్యవ హారశైలి నిదర్శనంగా కనబడుతోంది.

సో...త్వరలోనే ఆమె హైదరాబాద్‌ నుంచి మూటా ముల్లె సర్దుకొని చెన్నయ్‌ వెళ్లిపోతుందని మీడియా వర్గాల సమాచారం. జయలలిత మరణించాక మెరీనా బీచ్‌లోని ఆమె సమాధికి నివాళులు అర్పించిన తరువాత పోయస్‌ గార్డెన్‌కు వెళ్లి శశికళను కలిసి (జైలుకు వెళ్లకముందు) మద్దతు ప్రకటించింది. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో పళనిసామి విజయం సాధించాక చిన్నమ్మకు అభినందనల వీడియో పంపింది. మాజీ ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం, ఆయన తరపు ఎమ్మెల్యేలను 'క్షుద్రశక్తులు' అని విమర్శించింది.

చిన్నమ్మ మాత్రమే అన్నాడీఎంకేను రక్షించగలరని తెలిపింది. తమిళ రాజకీయాలపై రాములమ్మ ఓవర్‌యాక్షన్‌ చూసి ఒళ్లు మండిపోయిన తమిళ సంగీత దర్శకుడు జేమ్స్‌ వసంతన్‌ 'విజయశాంతీ... నువ్వు రాజకీయ దిగ్గజం అనుకుంటున్నావా? నీ అభిప్రాయాలు మీ రాష్ట్రంలో చెప్పుకో. ఇది సినిమా కాదు. తమి ళ ప్రజల జీవితాలు'..అని ఘాటుగా విమర్శించాడు. ఆర్‌కేనగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఈ మాజీ హీరోయిన్‌ ఆ ఉప ఎన్నిక వాయిదా పడినప్పటికీ అక్కడే ఉండి కొన్ని రోజులు ప్రచారం చేసింది.

ఆ సమయంలో 'మెరుగైన సమాజం' కోసం పనిచేస్తు న్నట్లు చెప్పుకుంటున్న ఓ తెలుగు టీవీ ఛానెల్‌ రిపోర్టర్‌ ఆమెతో చిన్నపాటి ఇంటర్వ్యూ చేశాడు. పూర్తి మేకప్‌తో అప్పటి హీరోయిన్‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్న రాములమ్మ ఎంతో హుషారుగా ప్రచార వాహనం మీది నుంచి రిపోర్టర్‌తో మాట్లాడింది. ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నిక వాయిదా పడటానికి బీజేపీ కుట్రే కారణమని చెప్పింది. 'అమ్మ' మరణం వెనక ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు లేవని, అదంతా సహజంగా జరిగిందేనని చెప్పింది.

గత ఎన్నికల తరువాత తెలంగాణలో పూర్తిగా అజ్ఞాతంలో ఉన్న, కాంగ్రెసులో ఉంటూ కూడా గాంధీ భవన్‌ గడప తొక్కని విజయశాంతి చెన్నయ్‌లో మాత్రం యమ హుషారుగా ఉంది. ఆ ఎన్నిక నిర్వహించకుండా నిలిపేసిన తరువాత హైదరాబాద్‌కు వచ్చేసిన ఆమె తాజాగా అన్నాడీఎంకేలో చెలరేగిన వేడివేడి పరిణామాలతో చెన్నయ్‌ వెళ్లింది. కొంతకాలం క్రితం బెంగళూరు జైలుకు వెళ్లి శశికళతో మాట్లాడివచ్చిన విజయశాంతి తాజాగా అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తీహార్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన టీటీవీ దినకరన్‌తో సమావేశమైంది. 

వీరు చాలా విషయాలు ముచ్చటించుకున్నారని, దినకరన్‌ ఆమెకు ఎంతో ప్రాధాన్యమిచ్చాడని సమాచారం. ఆమె అన్నాడీఎంకే (శశికళ వర్గం)లో చేరుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తమిళ రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేకపోతే విజయశాంతి ఇంత హడావుడి చేయదు కదా...! టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు చురుగ్గా వ్యవ హరించిన విజయశాంతి కాంగ్రెసులోకి వెళ్లాక ఉద్దేశ పూర్వకంగానే అజ్ఞాతంలో ఉండిపోయింది. తెలంగాణలో ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రచారానికి రావల్సిందిగా కాంగ్రెసు నాయకులు ఎంతగా బతిమాలినా నోరు విప్పలేదు.

రాహుల్‌ గాంధీ రాష్ట్రానికి వచ్చినా ఆమె ఊసు లేదు. తాను తెలంగాణ రాజకీయా ల్లో విఫలమయ్యానని భావిస్తోందా? ఇక్కడ తనకు రాజకీయ మనుగడ లేదని అనుకుంటోందా? ఆమె చెన్నయ్‌ వదిలేసి దశాబ్దలు గడిచిపోయాయి. మరి ఇప్పుడు అక్కడికి వెళ్లి నెగ్గుకు రాగలదా? రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తాడనగానే 'అతను స్థానికుడు కాదు.

ఇక్కడ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి వీలులేదు' అంటూ కొందరు సినిమా తారలే మండిపడ్డారు. అలాంటిది విజయశాంతి స్థానికురాలవుతుందా? తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాక అక్కడి జనం ఈమెను ఆదరిస్తారా? తమిళనాడు వైపు చూడటానికి అసలు కారణం ఏమిటో.....!

-మేనా

Show comments