టాలీవుడ్ ఫుల్ బిజీ గురూ

టాలీవుడ్ కు నిర్మాతలే ప్రాణం. నిర్మాతలు లేకుంటే సినిమా రంగమే లేదు. అది అందరికీ తెలిసిందే. అయితే గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రసిద్ధ బ్యానర్లు చాలా వరకు కనుమరుగైపోయాయి. అయితే ఇటీవల కాలంలో కొత్త బ్యానర్లు అనేకం వచ్చాయి. పైగా భారీ సినిమాలు, చకచకా సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ కళకళ లాడుతోంది. ఎంత కళకళలాడుతోంది అంటే, ఇప్పుడు దాదాపు ఫామ్ లో వున్న ఏ హీరో కూడా ఖాళీ లేరు. చిన్న అని లేదు, పెద్ద అని లేదు ప్రతి హీరో చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు వున్నాయి. డైరక్టర్లు కూడా అలాగే వున్నారు. సక్సెస్ ను చవి చూసిన ప్రతి డైరక్టర్ చేతిలో ప్రాజెక్టులు వున్నాయి. ఏ ఇతర భాషల సినిమా రంగంలోనూ లేనంత మంది హీరోలు మన దగ్గర వున్నా కూడా, నిర్మాతలు, డైరక్టర్లు ప్రాజెక్టుల కోసం ఇంకా వెదుకుతున్నారు.

ఈ ఏడాదికి మే నెలాఖరు వరకే దగ్గర దగ్గర యాభై సినిమాలు విడుదలైపోయాయి.  ఇంకో ఏడు నెలల్లో ఎన్ని విడుదలవుతాయో? అయినా కూడా ఇంకా బోలెడు మంది నిర్మాతలు రెడీగా వున్నా ప్రాజెక్టులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. కబాలి తెలుగు వెర్షన్ నిర్మాతలు సరైన ప్రాజెక్టు కోసం వెదుకుతున్నారు. అలాగే ప్రేమమ్, బాబు బంగారం నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సరైన ప్రాజెక్టు కోసం చూస్తోంది. రాజుగారి గది 2 నిర్మిస్తున్న పివిపి సంస్థ సరైన భారీ ప్రాజెక్టు కోసం వేచి వుంది. చుట్టాలబ్బాయి తీసిన నిర్మాతలు మరో ప్రాజెక్టు కోసం వెదుకుతున్నారు.

బస్ ల వ్యాపారం ఆపేసిన విజయవాడ ఎంపీ కేశినేని సినిమా రంగంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. మంచి ప్రాజెక్టు కోసం తెగ గాలిస్తున్నారు. సినిమా హీరోలు అందరూ దాదాపు పక్కన పెట్టేసిన నిర్మాత బండ్ల గణేష్ ఎలాగైనా ఓ పెద్ద ప్రాజెక్టు చేయాలని కిందా మీదా అవుతున్నారు.

జెంటిల్ మెన్ లాంటి హిట్ సినిమా చేసిన నిర్మాత మళ్లీ మరో సినిమా చేయాలంటే ప్రాజెక్టు కుదరడం లేదు. ఇప్పటి వరకు పవన్ తో సినిమాలు తీసిన నార్త్ స్టార్ మూవీస్ సంస్థ మీడియం బడ్జెట్ సినిమాలు తీయాలని చూస్తోంది. ఇంకా ప్రాజెక్టు సెట్ కావడం లేదు.

ఇలా ఒకరూ ఇద్దరు కాదు, ఈ బ్యానర్, ఆ బ్యానర్ అని లేదు. ఎంతో మంది ప్రాజెక్టుల కోసం చూస్తున్నారు.  హీరోలు అందరూ బిజీ కావడం అన్నది కీలకమైన సమస్య. అదే సమయంలో ఏది పడితే అది తీసేద్దామనే వైఖరి చాలా వరకు మారింది. హీరోలు ఆచి తూచి సినిమాలు ఓకె చేస్తున్నారు. నిర్మాతలు కూడా కొంత వరకు అలాగే ఆలోచిస్తున్నారు. మొత్తం మీద టాలీవుడ్ బాగా బిజీ అయిపోయింది.

Show comments