బాబు విదేశీ మోజు భక్తులకు చేటు...!

వెనకటికి ఒకడిని ఊరి ప్రజలంతా మంచోడు...మంచోడు అని పొగుడుతుంటే వాడు మంచమంతా ఖరాబు చేశాడట. ఎలా ఖరాబు చేశాడో ఈ సామెత గురించి తెలిసిన పెద్దోళ్లను అడిగితే చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా. ఎంతో అనుభవజ్ఞుడు కాబట్టి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చేస్తే ఎంతో మేలు చేస్తారని ప్రజలు భావించి ఎన్నికల్లో 'పచ్చ బొట్టేశామురా చంద్రబాబూ నీకు' అని పాడుకుంటూ టీడీపీని గెలిపించారు. కాని సీన్‌ రివర్స్‌ అయింది. 

బాబు ముఖ్యమంత్రి కాగానే తమకు మేలు చేస్తారని ప్రజలు భావించగా, ఆయన మాత్రం విదేశీ కంపెనీలకు 'మేళ్లు' చేయడం మొదలుపెట్టారు. దేశదేశాలు తిరిగి 'మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి...సిరిసంపదలతో తులతూగండి'...అని ఆహ్వానించారు. సరే..కంపెనీలు, పరిశ్రమలు పెట్టేవారు వస్తే మంచిదే. కాని బాబు విదేశీ మోజును కనిపెట్టిన ఫారినర్స్‌ రాష్ట్రంలో పెద్ద పెద్ద నిర్మాణాల నుంచి చిన్నాచితక నిర్మాణాల వరకు తామే చేస్తామంటూ పరుగెత్తుకు వచ్చారు. ఏ పనైతే ఏముంది? డబ్బులు రావడం ముఖ్యం. చివరకు పుష్కర ఘాట్లు కూడా తామే నిర్మిస్తామనగానే విదేశీయులు బ్రహ్మాండంగా నిర్మిస్తారని సంతోషించిన బాబు విజయవాడలో చైనా కంపెనీకి పనులు అప్పగించారు. 

విదేశీయులు పుష్కర ఘాట్లు నిర్మిస్తున్నారని చెప్పుకోవడాన్ని బాబు గొప్పగా ఫీలయ్యారు. ఇప్పుడు ఆ పుష్కర ఘాట్ల దగ్గర స్నానాలు చేస్తున్న భక్తులు తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్నారని సమాచారం. ఎందుకు? చైనా వాళ్లు నిర్మించిన పుష్కర ఘాట్లు అద్భుతంగా లేవా? భక్తులు ఆగ్రహిస్తున్నారంటే లేవనే కదా అర్థం. పుస్కరాలంటే చైనా వాళ్లకేం తెలుసు? మెట్లు కట్టడమనే అనుకున్నారు. ఏదో తోచిన రీతిలో కట్టేసి డబ్బు తీసుకొని వెళ్లిపోయారు. వాళ్ల వెంట ఉన్న రాష్ట్ర అధికారులకూ ఏమీ తెలియదా? ఘాట్లు ఏ విధంగా నిర్మించాలో వారు కూడా చెప్పనట్లుగా ఉంది. పుష్కరాలంటే కేవలం స్నానాలు చేసి వెళ్లిపోవడం కాదు. 

స్నానాలు  చేశాక  దివంగతులైన తమ పెద్దలకు తర్పణాలు వదులుతారు. కొందరు పిండప్రదానం (తద్దినాలు) చేస్తారు. దానాలు ధర్మాలు చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ నది దగ్గరే, ఘాట్ల మీదనే చేస్తారు. అందుకే అవి విశాలంగా ఉండాలి. కాని చైనా వాళ్లు నిర్మించిన ఘాట్లు చాలా ఇరుకుగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పితృ కార్యాలు చేసుకోవడానికి షెల్టర్లు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం వానా కాలమైనా కొంత కాలంగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో కార్యక్రమాలు నిర్వహించుకోవడం కష్టంగా ఉంది. అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధుల కోసం ర్యాంపులు కట్టకపోవడంతో మెట్లు ఎక్కి దిగడం కష్టంగా ఉంది. 

విజయవాడలో దుర్గా ఘాట్‌, మరికొన్ని ఘాట్లను చైనాకు చెందిన గయ్‌జొ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ (జిఐఐసి) నిర్మించింది. పితృ కార్యాలు నిర్వహించుకోవడానికి ఎలాంటి ప్లాట్‌ఫారాలు లేకుండా మెట్లు కూడా ఇరికిరుగ్గా కట్టారని, పుష్కరాలు, పిండ ప్రధానాల గురించి చైనా వాళ్లకు ఏం తెలుస్తుందని భక్తులు ఆగ్రహిస్తున్నారు. చంద్రబాబుకు విదేశీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వడం తప్ప మన సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలని తెలిస్తేగదా...! కృష్ణా పుష్కరాల ప్రధాన కేంద్రం విజయవాడ.  పుష్కరాలను ఆధారం చేసుకొని పర్యాటకులను పర్మినెంటుగా ఆకర్షించేలా నిర్మాణాలు చేయాలని ప్లాన్‌ చేసింది బాబు సర్కారు. 

అందులో భాగంగా ఘాట్లను బాగా అభివృద్ధి చేసి హంగులు రంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఆలోచన బాగానే ఉందిగాని ఈ పనులన్నీ విదేశీయులకు ఇవ్వడం ఎందుకనేది ప్రశ్న. పుష్కరాలకు సంబంధించిన పనులు చేసే నిర్మాణ సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో లేవా? ఇక్కడ లేకపోతే దేశంలో లేవా? మన సంస్కృతీ సంప్రదాయాలు తెలియని చైనా వారికి ఎందుకివ్వడం? ...ఇలాంటి విమర్శలు అనేకం వచ్చినా బాబు లెక్కచేయలేదు. 

జిఐఐసీ కంపెనీకి చెందిన 15 మంది సభ్యుల చైనా బృందం విజయవాడకు వచ్చింది. కనకదుర్గ ఆలయ అధికారులు పుష్కరాల ప్రాధాన్యం, ఆలయ చరిత్ర వగైరా  చైనా వారికి వివరించారు.  వాళ్లు చెప్పింది చైనా వాళ్లకు ఎంతవరకు అర్థమైందో తెలియదు. చివరకు వాళ్లకు తోచినట్లు నిర్మించారు. బాబు సర్కారు కోట్లు ఖర్చుచేసినా ఏం లాభం? భక్తులతో తిట్లు తినక తప్పలేదు.

Show comments