8 వేల కోట్లు మాత్రమేనా.?

''పోలవరం జాతీయ ప్రాజెక్టు.. లెక్క ప్రకారం అయితే 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం నిధులు ఆంధ్రప్రదేశ్‌ భరిస్తాయి.. కానీ, ఆంధ్రప్రదేశ్‌ మాకు ప్రత్యేక రాష్ట్రం. అందుకే 100 శాతం ఖర్చు మేమే భరిస్తాం..'' 

- ఇదీ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పిన మాట. 

'కేంద్రం మొత్తం భరిస్తామంటే, ఎలా వద్దంటాం.? సంతోషమే కదా.! అందుకే కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం..' అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు సెలవిచ్చారు. కానీ, అక్కడ మర్మం ఇంకోటుంది. విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు చేసిన నిధుల్ని మాత్రమే కేంద్రం పూర్తిస్థాయిలో ఇస్తుంది. అంతకు ముందు ఖర్చు చేసిన ఐదు వేల కోట్ల రూపాయల మాటేమిటి.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

అసలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆలోచించుకునే ఛాన్స్‌ ఎక్కడిస్తున్నారు చంద్రబాబు.? కేంద్రం బిచ్చమేస్తే చాలు, చంద్రబాబు చంకలు గుద్దేసుకుంటున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో వున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ విద్యా సంస్థల్ని నెలకొల్పుతోంటే, అక్కడికేదో అది ఆంధ్రప్రదేశ్‌కే ప్రత్యేకమనే చంద్రబాబు వైఖరి దివాళాకోరుతనానికి నిదర్శనం. చంద్రబాబు బేలతనాన్ని కేంద్రం భలేగా క్యాష్‌ చేసుకుంటోంది. 

ఇక, పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే, తాజా అంచనాలు 30 వేల కోట్లుపైనే.. అని తేలినా, అంత మొత్తంలో కేంద్రం ఖర్చు చేసే అవకాశాల్లేవు. ఈలోగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు.. తొలి దశ, మలి దశ అని చెబుతూ. కాఫర్‌ డ్యామ్‌ కట్టేసి, దాన్నే తొలి దశగా ప్రకటించేసి, 2018 నాటికి పూర్తి చేసేస్తామని సెలవిచ్చారు. ఇకనేం, కేంద్రం ఓ ఐదారు వేల కోట్ల రూపాయలు విదిలించేసి, చేతులు దులిపేసుకోడానికి మార్గం సుగమం అయ్యింది. 

తాజాగా, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌, కేంద్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో అనుసరిస్తున్న కుట్రపూరిత వైఖరి, చంద్రబాబు ప్రదర్శిస్తున్న బేలతనాన్ని ఎండగట్టారు. కేంద్రం చెబుతున్నదాన్నిబట్టి, చంద్రబాబు ఒప్పుకున్నదాన్ని బట్టి, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి పోలవరం ప్రాజెక్టు పేరుతో ఇచ్చేది 8 వేల కోట్లు మాత్రమేనని వైఎస్‌ జగన్‌ తేల్చారు. అదే నిజమైతే గనుక, ఇక పోలవరం ప్రాజెక్టు దాదాపుగా అటకెక్కినట్లే. 

నిన్నటికి నిన్న చంద్రబాబు, ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో భేటీ అయ్యాక, 'పదేళ్ళ ప్రత్యేక హోదా ప్రయోజనాల్ని ప్యాకేజీ రూపంలో కేవలం రెండేళ్ళలోనే సర్దుబాటు చేశాం..' అన్న కేంద్రం మాటని (అన్నారో, అన్లేదో) తనకు అనుకూలంగా వ్యవహరించే మీడియా ద్వారా ప్రచారం చేయించారు. ప్యాకేజీ ఊసెత్తకుండా ప్రత్యేక సాయం పేరుతో కాకి లెక్కలు చెప్పిన అరుణ్‌ జైట్లీ, ఇంతవరకు దానికి చట్టబద్ధతపై ఎలాంటి ముందడుగూ వేయకపోవడం గమనార్హం. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల్ని చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టు పెట్టేస్తున్నప్పుడు.. కేంద్రమెందుకు, ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది.? ఛాన్సే లేదు.

Show comments