ఆంధ్ర - తెలంగాణ.. 'ట్రావెల్స్‌' రచ్చ.!

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అత్యుత్సాహం ఇప్పుడు తెలంగాణ - ఆంధ్ర రచ్చకు కారణమయ్యింది. ప్రైవేటు ట్రావెల్స్‌ అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ శ్రీనివాస్‌గౌడ్‌ అసెంబ్లీలో నిన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జేసీ బ్రదర్స్‌కి చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌పై శ్రీనివాస్‌గౌడ్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో వివాదం ముదిరి పాకాన పడింది. తమ ట్రావెల్స్‌కి చెందిన బస్సులు పూర్తి పర్మిట్లతో నడుస్తున్నాయని, వివక్షాపూరితంగా తమపై ఆరోపణలు చేయడమేంటని ఆరోపిస్తూ శ్రీనివాస్‌గౌడ్‌ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్‌ కూడా విసిరేశారు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఇద్దరూ బస్తీ మే సవాల్‌.. అనుకున్నారు.. హైద్రాబాద్‌లోని ఆర్‌టిఎ కార్యాలయాన్ని ఇందుకు వేదికగా ఫిక్స్‌ చేసుకున్నారు. 

తెలంగాణ ఎమ్మెల్యేని అడ్డుకోని పోలీసులు, ఏపీ ఎమ్మెల్యేని మాత్రం అడ్డుకుని, అరెస్ట్‌ చేయడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యేని గనుకనే తనను అరెస్ట్‌ చేశారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. తానేమీ అనుచరుల్ని వెంటేసుకుని గొడవకు వెళ్ళలేదనీ, శ్రీనివాస్‌గౌడ్‌ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పేందుకే ఆధారాలతో సహా వచ్చానన్నది ఆయన వాదన. అయితే, శ్రీనివాస్‌గౌడ్‌ వాదన ఇంకోలా వుంది. తన ఆరోపణలకు సమాధానం చెప్పలేక, తానే స్వయంగా అరెస్టయ్యారని ఆరోపిస్తున్నారీయన. తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేని కాదని, తన మాటని పోలీసులు ఎలా వింటారని జేసీ దివాకర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. 

ఈ ఎపిసోడ్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ అడ్డంగా బుక్కయిపోయారు. దాంతో, ఆర్టీసీ మనుగడ.. అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రైవేటు ట్రావెల్స్‌పై నియంత్రణ వుండాలనీ, ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలూ ఆర్టీసీని ఆదుకోవాలన్నదే తన ఉద్దేశ్యమని శ్రీనివాస్‌గౌడ్‌ సన్నాయి నొక్కులు నొక్కుతుండడం విశేషం. 

ఒక్కటి మాత్రం నిజం.. శ్రీనివాస్‌గౌడ్‌ తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్యే గనుక, దివాకర్‌ ట్రావెల్స్‌ అనే కాదు, దేనిమీద అయినా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయొచ్చు. కోర్టులకు వెళ్ళేందుకు ఎటూ అవకాశముంది. కానీ, ఏదో సాధించేద్దామనుకుని.. ఏదేదో చేసేసి, ఇలా దొరికిపోయారు. 'మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మా బస్సులకు అనుమతులిచ్చింది..' అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో శ్రీనివాస్‌గౌడ్‌ ఇరకాటంలో పడిపోయారు.  Readmore!

ఏదిఏమైనా, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోయిందన్నది వాస్తవం. ఈ అక్రమాల్లో ఆంధ్ర, తెలంగాణ అన్న తేడాల్లేవు. రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీసీకి అశనిపాతంలా తయారయ్యాయి ప్రైవేటు ట్రావెల్స్‌. ఎవరు అధికారంలో వున్నాసరే, ప్రైవేట్‌ ట్రావెల్స్‌కి 'గులాంగిరీ' చెయ్యాల్సిందే మరి.!

Show comments