సబ్బు బిళ్ళ, కుక్కపిల్ల, అగ్గిపుల్ల.. కాదేదీ కవితకనర్హం.. అన్నాడో కవి. అచ్చం దాన్నే ఫాలో అయిపోతున్నట్టున్నాడు టాలీవుడ్ దర్శకుడు 'అల్లరి' రవిబాబు. అందుకే, పబ్లిసిటీ కోసం పందిని చంకలో పెట్టుకుని తిరిగేస్తున్నాడు. ఆల్రెడీ పందిపిల్లను చంకన పెట్టుకుని ఇంటర్వ్యూలు ఇచ్చేశాడు లెండి. అక్కడితో ఆగలేదు అల్లరి రవిబాబు.
దేశంలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ నోట్ల రద్దు పుణ్యమా అని బ్యాంకుల వద్దా, ఏటీఎం సెంటర్ల వద్దా చాంతాడంత క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. అదిగో ఆ క్యూలైన్లలోనే అల్లరి రవిబాబు తన పందిపిల్లతో సహా దర్శనమిచ్చేశాడు. చిత్రంగా, దేశంలో ఎక్కడా ఏ ప్రముఖుడూ డబ్బుల కోసం క్యూలైన్లలో కన్పించలేదు. సినీ సెలబ్రిటీలు అటు బ్యాంకుల్లోగానీ, ఇటు ఏటీఎం క్యూ లైన్లలోగానీ కన్పించలేదాయె. ఆ కోణంలో చూస్తే, అల్లరి రవిబాబు పెద్ద సాహసమే చేశాడు. పైగా, పందిని చంకలో పెట్టుకుని క్యూ లైన్లలో నిల్చుని అందరి దృష్టినీ ఆకర్షించేశాడు.
అల్లరి రవిబాబు, పందిపిల్లతో తీస్తున్న సినిమా పేరు గుర్తుంది కదా.? 'అదిగో'. 'బుజ్జిముండ.. ఎంత బుద్ధిగా వుందో చూడండి.. అస్సలేమీ డిస్టర్బ్ చెయ్యదు.. దానికి మనం పూర్తి భద్రతనిస్తున్నామనే నమ్మకం మనం కలిగిస్తే, మిగతా పెంపుడు జంతువులకన్నా బుద్ధిగా వుంటుంది.. పంది పిల్ల..' అంటూ ఓ ఇంటర్వ్యూలో పంది పిల్ల సిద్ధాంతం కూడా చెప్పేశాడండోయ్ అల్లరి రవిబాబు. వెరైటీ సినిమాలు తీయడంలోనే కాదు, వెరైటీ చేష్టలు చేయడంలోనూ అల్లరి రవిబాబు వెరైటీ అంతే.