మాజీ మంత్రి దేవినేని కన్నుమూత

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్తున్న విషయం విదితమే. రెండ్రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన దేవినేని నెహ్రూ, గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది.ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత, గుండెపోటు రావడంతో ఆయన్ని మళ్ళీ ఆసుపత్రికి తరలించామనీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవినేని నెహ్రూ మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

విజయవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దేవినేని నెహ్రూ, గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన దేవినేని, ఈ మధ్యనే టీడీపీలో చేరారు. దేవినేని నెహ్రూ, తన రాజకీయ వారసుడిగా తన కుమారుడు దేవినేని అవినాష్‌ని కాంగ్రెస్‌లో వున్నప్పుడే తెరపైకి తెచ్చారు. 

దేవినేని నెహ్రూ మృతికి పలువురు టీడీపీ నేతలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, పలువురు మంత్రులు, కేంద్ర మంత్రులు దేవినేని కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆయన మృతికి సంతాపం తెలిపారు.

Show comments