రామోజీ సంస్థలకు కొత్త అంబాసిడర్ వచ్చారోచ్ అనుకుంటున్నారు జనం. ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అని కూడా అనుకుంటున్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశం సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. ఆ సమయంలో ఆయన మీడియా సంచలనాల కోసం పాకులాడుతోందని, ప్రజలకు సరైన సమాచారాన్ని అందివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే.. ఈ సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల్లోని ఈనాడు మీడియాను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ విషయంలో ఈనాడు చాలా గొప్పగా జర్నజాన్ని బతికిస్తున్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇది చాలా మందికి నచ్చలేదు. అయితే వెంకయ్య రామోజీ సంస్థలను భుజాన వేసుకుని మోయడం కొత్త విషయం కాదు. కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ సినిమా సదస్సుకు రామోజీ ఫిలింసిటీ వేదికైంది అనే విషయం తెలిసిందే. ది ఇండీవుడ్ ఫిలిమ్ కార్నివాల్ పేరుతో నిర్వహించిన ఆ సదస్సులో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది ప్రతినిధులు పాల్గొన్నారు. బయ్యర్లు, సేల్స్ ఏజెంట్స్, ఎగ్జిబిటర్లూ, దాదాపు వేలాదిగా సందర్శకులూ వచ్చారు.
ఆ కార్యక్రమం ముగింపు సందర్భంగా హాజరైన కేంద్రమంతి వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగం విన్నవారిని ఆశ్చర్యంలో ముంచింది. ఎంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఇంతలా వెంకయ్య రామోజీని నెత్తిన పెట్టుకోవడం ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియాకు చిరాకు తెప్పించింది. ఓ రకంగా ఫిలింసిటీకి బ్రాండ్ అంబాసిడర్ పాత్ర పోషిస్తున్న లెవల్లో వెంకయ్య మాట్లాడడం ఆశ్చర్యకరం. సినిమా రూపకర్తల కోసం ఫిలింసిటీ అందిస్తున్న సేవల్ని ఆయన పదే పదే పొగిడారు.
అంతేకాదు ఫిలింసిటీకి వచ్చి అక్కడ అందించే సేవల్ని పొందాల్సిందిగా ఆయన అంతర్జాతీయ సినీ ప్రముఖుల్ని బహిరంగంగానే ఆహ్వానించారు. ఆయన మాటల్లో అంబాసిడర్ ధోరణికి ఒక మచ్చు తునక చెప్పాలంటే... "కలతో రండి క్యాసెట్‌తో వెళ్లండి" అంటూ ఫిలింసిటీకి రమ్మని చెప్పడానికి ఉపయోగించిన నినాదం చాలు. కేంద్రమంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రైవేటు సంస్థ తరపున ఇంతలా ప్రచారానికి దిగడం వెంకయ్యకు తగునా? అని ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా ప్రతినిధులు చర్చించుకోవడం కనిపించింది.
బహుశా రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో ప్రధాన ముద్దాయి తానే అయినప్పటికీ ఈనాడు తన మీద కనీసం చిన్న విమర్శకు కూడా తావివ్వకపోవడంతో వెంకయ్య స్వఛ్చందంగా బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తి ఆ విధంగా బదులు తీర్చుకుంటున్నారేమో..