వారెవ్వా విరాట్‌.. డబుల్‌ ధమాకా.!

ముంబై వాంఖెడే స్టేడియంలో విరాట్‌ కోహ్లీ దుమ్ము రేపేశాడు. టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. టీమిండియాకి సంబంధించినంతవరకు ఈ 'ఫేజ్‌' చాలా కొత్తగానే కన్పిస్తోంది భారత క్రికెట్‌ అభిమానులకి. మామూలుగా అయితే, నాలుగైదు వికెట్లు పడితే, ఇక టీమిండియా పని అంతే. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 

విరాట్‌ కోహ్లీ డబుల్‌ సాధించాడంటే, అందులో టెయిల్‌ ఎండర్ల సహకారం ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాలి. ఓపెనర్‌ మురళీ విజయ్‌ టీమిండియాకి మంచి పునాది వేస్తే, కెప్టెన్‌ కోహ్లీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆల్‌ రౌండర్‌గా రెచ్చిపోతున్న అశ్విన్‌ ఈసారి నిరాశపర్చాడు. అయితేనేం, మరో ఆల్‌రౌండర్‌ జయంత్‌ యాదవ్‌ సరైన సమయానికి టీమిండియాకి వెన్నుదన్నుగా నిలిచాడు. 

ఇక, ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌ వెరీ వెరీ స్పెషల్‌ అని చెప్పక తప్పదు. కోహ్లీ తన సహజ శైలికి భిన్నంగా కనిపించాడు. సాధారణంగా అయితే, కోహ్లీలో దూకుడు చాలా ఎక్కువగా కన్పిస్తుంటుంది. బంతిని బలంగా గాల్లోకి లేపేందుకే ఇష్టపడ్తాడు.. అలా బౌండరీ లైన్‌ దాటించేయడమంటే కోహ్లీకి చాలా చాలా ఇష్టం. టెక్నిక్‌ విషయంలో కోహ్లీని వంక పెట్టలేమనుకోండి.. అది వేరే విషయం. తాజా డబుల్‌ సెంచరీలో ఒక్కటంటే ఒక్క సిక్స్‌ని కూడా బాదలేదు కోహ్లీ. అఫ్‌కోర్స్‌, ఒకటీ అరా 'లైఫ్‌'లు వచ్చినా, అవన్నీ క్రికెట్‌లో మామూలే. 

మొత్తంగా విరాట్‌ కోహ్లీకి ఇది మూడో డబుల్‌ సెంచరీ. ఈ మూడు డబుల్‌ సెంచరీలూ కోహ్లీ ఈ ఏడాదే సాధించడం గమనార్హం. మ్యాచ్‌ మ్యాచ్‌కీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోన్న కోహ్లీ, అటు కెప్టెన్‌గానూ, ఇటు ఆటగాడిగానూ రాణిస్తుండడంతో టీమిండియా వరుస విజయాల్ని సొంతం చేసుకోగలగుతోంది.  Readmore!

కోహ్లీ మైదానంలో అలా రెచ్చిపోతోంటే, ఇంగ్లాండ్‌ బౌలర్లు తలపట్టుక్కూర్చోవడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. ఇంతవరకూ ఏ మ్యాచ్‌లోనూ లేని విధంగా ఇంగ్లాండ్‌ ఆటగాళ్ళు తమ నైరాశ్యాన్ని మైదానంలో ప్రదర్శిస్తుండడం గమనార్హం.

లంచ్ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 579 పరుగులు చేసింది. కోహ్లీ 212 పరుగులతోనూ, జయంత్ యాదవ్ 92 పరుగులతోనూ క్రీజ్ లో వున్నారు.

Show comments