తెలుగు తెరపై తనకు నచ్చిన రీతిలో అవకాశాలు రాకపోవడం వల్లే తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయానని అంటోంది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. తెలుగులో మహేష్ సరసన '1 నేనొక్కడినే' సినిమాలోనూ, నాగచైతన్య సరసన 'దోచెయ్' సినిమాలోనూ కృతి సనన్ నటించిన విషయం విదితమే. ఈ రెండు సినిమాలూ ఆమెకు బ్యాడ్ రిజల్ట్‌నే ఇచ్చాయి. దాంతో 'ఐరన్ లెగ్' స్టాంప్ వేసేశారు టాలీవుడ్‌లో ఆమె మీద.
ఈ మధ్యకాలంలో కృతి సనన్‌ని పిలిచి అవకాశాలిచ్చేందుకు టాలీవుడ్‌లో దర్శక నిర్మాతలెవరూ సుముఖత వ్యక్తం చేయడంలేదన్నది ఓపెన్ సీక్రెట్. కృతి మాత్రం తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయిగానీ, కథలు నచ్చకపోవడం వల్లే ఏ సినిమానీ అంగీకరించలేదని చెబుతోంది. హీరోయిన్ అంటే పాటల్లో హీరోతో కలిసి డాన్సులేసే పాత్ర కాదనీ, అంతకు మించి హీరోయిన్‌కి గుర్తింపు వుండాలనీ కృతి సనన్ అభిప్రాయపడ్తోంది.
ప్రస్తుతానికి బాలీవుడ్‌లో బిజీగా వుందట. సౌత్‌లో హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ వుండదనీ, అక్కడ గ్లామర్‌కే ఎక్కువ ఛాన్సులుంటాయనీ, అదే బాలీవుడ్‌లో అయితే భిన్నమైన కథాంశాలతో సినిమాలొస్తాయనీ, హీరోయిన్లకు సినిమాల్లో చాలా స్కోప్ వుంటుందనీ అంటోంది కృతి సనన్. ఏరు దాటాక తెప్ప తగలేయడమంటే ఇదేనేమో.! ఈ పని చాలామంది హీరోయిన్లు చేశారు. ఆ లిస్ట్‌లోకి కృతి చేరిపోయిందంతే.