ఏపీ, తెలంగాణ.. నీరు వివాదమెరుగు.!

ఇంకేముంది.. ఢిల్లీ వేదికగా నీటి పంపకాలపై చర్చలు జరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం సద్దుమణిగిపోతుందనీ, పంపకాలపై క్లారిటీ వస్తుందనీ అంతా అనుకున్నారు. కానీ, షరామామూలుగానే ఢిల్లీలో నీటి పంచాయితీ తెగలేదు. నీరు పల్లమెరుగు.. అన్న మాటలో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ రాష్ట్రాల మధ్య మాత్రం నీరు వివాదమెరుగు.. అని చెప్పాల్సి వస్తుంది. 

పట్టిసీమ ప్రాజెక్ట్‌ ద్వారా నీటిని కృష్ణా నదిలో కలుపుతున్నారు కాబట్టి, ఆ నీటి లెక్క తేల్చి, అందులోంచి తమ వాటా లెక్క తీయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది ఆంధ్రప్రదేశ్‌కి. ఇదెక్కడి విడ్డూరం.? అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముక్కున వేలేసుకుంటోంది. అంతేనా, తెలంగాణ తీరుని ఎండగడ్తోంది. చాలా చిత్రమైన సందర్భమిది. 

ఆ మధ్య తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా, పట్టిసీమ ప్రాజెక్ట్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. 'ఆది వారి నీటి అవసరాల కోసం చేపట్టిన ప్రాజెక్ట్‌.. వివాదాల జోలికి నేను పోవడంలేదు.. చంద్రబాబుని ఈ విషయంలో అభినందిస్తున్నాను.. రైతులకు మేలు జరగడం కోసం ఇలాంటి చర్యలు తీసుకోక తప్పదు..' అని కేసీఆర్‌ అసెంబ్లీలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. అక్కడేమో అలా అభినందించి, ఇదిగో.. ఢిల్లీకి హరీష్‌ని పంపిన కేసీఆర్‌, పట్టిసీమ పేరుతో కొత్త మెలికను తెరపైకి తెచ్చారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. తమ భూభాగంలో వున్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులోని తమ వాటా గేట్లను ఆపరేట్‌ చేసుకుంటామంటోంటే, ససేమిరా కుదరదనీ, మొత్తం గేట్ల నిర్వహణ తమదేనని తెగేసి చెబుతోంది. ఇక్కడా వివాదం ఓ కొలిక్కి రావడంలేదు. పరిస్థితి ఎటూ తెగేలా కన్పించకపోవడంతో, కేంద్రం.. ఇరు రాష్ట్రాలకూ నవంబర్‌ 1 వరకు గడువు ఇచ్చింది. ఈలోగా సమస్యను పరిష్కరించుకోవాలనీ, లేదంటే కేంద్రమే జోక్యం చేసుకుంటుందనీ స్పష్టం చేసింది.  Readmore!

ఇక్కడో పెద్ద కామెడీ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ వాటాలోని ఒక్క నీటి బొట్టూ అవసరంలేదని ఏపీ మంత్రి దేవినేని ఉమ చెబుతారు.. అలాగే, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక్క నీటి చుక్క కూడా తెలంగాణకు అవసరం లేదని తెలంగాణ మంత్రి హరీష్‌రావు చెబుతారు. ఇద్దరి మాటా అదిరింది. విడివిడిగా ఇద్దరూ ఇరు రాష్ట్రాల ప్రయోజనాల గురించీ ఆలోచిస్తున్నారు. ఒక్కచోట కూర్చుంటే మాత్రం పంచాయితీ తెగడంలేదాయె. ఇదే మరి రాజకీయం అంటే. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించే సమయంలోనే నీటి పంపకాలపైనా స్పష్టత ఇచ్చేసి వుంటే, ఇదిగో.. ఈ దుమారం చెలరేగి వుండేది కాదు. కానీ, గతాన్ని తలచుకుని ఏం ప్రయోజనం, జరగాల్సింది ఆలోచించాలి తప్ప.! 

Show comments

Related Stories :