కాంగ్రెస్ సీన్ రివర్స్

తెలుగు రాష్ట్రాల్లో పాపం కాంగ్రెస్ పార్టీకి అంతా రివర్సు గానే తయారయింది. ఏపీని విభజించి రాజకీయంగా లబ్దిపొందాలని కన్న కలలన్నీ కల్లలయ్యాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణలో పాగా వేయడం ఖాయం అనుకుంటే అది కాస్తా రివర్స్ అయింది. అంతే కాదు  ఇందులో భాగంగా తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయాలనే ప్రతిపాదనను పెట్టింది. టీఆర్ఎస్ కూడా అందుకు సరేనంది. అదే జరిగితే ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు ఎదురుండదని భావించింది. అందుకే ఏపీలో పార్టీ సర్వనాశనమవుతుందని తెలిసినా విడగొట్టేందుకు పరుగులు తీసింది. విడగొట్టి బోర్లా పడింది 

కాంగ్రెస్. విలీనం అవుతుందని భావించిన టీఆర్ఎస్ హ్యాండిచ్చింది. విలీనం కాకున్నా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి టీఆర్ఎస్ మోసం చేసిందని ప్రచారం చేసి లబ్దిపొందాలని చూసింది. తెలంగాణ ఇచ్చింది తామేనని, తాము ఇవ్వకుంటే తెలంగాణ ఎప్పటికి వచ్చేది కాదని ప్రచారపర్వంలో దుమ్మురేపింది. ఈ ప్రచారాన్ని టీఆర్ఎస్ సమర్థవంతంగా తిప్పి కొట్టింది. సరే, అధికారం అందలేదు..ప్రతిపక్షంగా ఉండైనా 2019నాటికి బలపడి తెలంగాణలో అధికారం దక్కించుకోవాలను కుంది కాంగ్రెస్. కాని అది కూడా నెరవేరేలా కనిపించడం లేదు. 

తెలంగాణ వస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందనుకుంటే రివర్స్ లో కాంగ్రెసే తెలంగాణలో టీఆర్ఎస్ లో విలీనం అయ్యే పరిస్థితులు దాదాపుగా సమీపించాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ కు చెందిన హేమాహేమీలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన వారందరిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. వారికి చెందిన బలమైన క్యాడర్, నమ్మకమైన అనుచరులంతా టీఆర్ఎస్ లో చేరారు. కాబట్టి వారు కూడా నేడో రేపో టీఆర్ఎస్ లో చేరక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడతాయి. 

కాంగ్రెస్ లో మిగిలి ఉన్న వారిలో అతి ముఖ్యమైన నాయకుడు సీఎల్పీ నేత జానారెడ్డి. జానారెడ్డికి కుడిభుజం లాంటి నాయకుడు ఎమ్మెల్యే భాస్కర్ రావు. అలాంటిది ఆయన కూడా తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించాడు. అంటే జానా కూడా నేడో రేపో కారెక్కాల్సిన పరిస్థితే. జానారెడ్డి పోతే మిగిలిన ముఖ్యనేతలెవరంటే కచ్చితంగా చెప్పాలంటే నలుగురే కనిపిస్తున్నారు. వారు కూడా రెండే కుటుంబాలకు చెందిన ఇద్దరేసి వ్యక్తులు. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మరొకరు ఆయన సతీమణి పద్మావతి. మూడోది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయితే నాలుగో నాయకుడు ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి. 

అంటే వీరిలో ఇద్దరు చేరితే నలుగురు చేరినట్టే. అందులో కోమటిరెడ్డి రేసులో ఉన్నారు. మిగిలింది టీపీసీసీ అధ్యక్ష్యుడు ఉత్తమ్, ఆయన భార్య. వారు చేరినా చేరకున్నా కాంగ్రెస్ ఖాళీ అయినట్టే భావించాలి. వీరు కాకుండా జిల్లాల్లో పరిశీలిస్తే నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఉన్నారు. వీరిలో సురేష్ రెడ్డి, అనిల్ లు కారెక్కుతున్నారన్న ప్రచారం ఎప్పుడో మొదలయింది. అంటే మొత్తం మీద కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం అవుతుందనుకుంటే అది కాస్తా రివర్స్ లో తెలంగాణలో కాంగ్రెసే టీఆర్ఎస్ లో విలీనం అవుతోందన్నమాట.

Show comments